సెంచరీ కొట్టడం.. 5 వికెట్ల ఘనత సాధించడం క్రికెట్ లో ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఒక ప్లేయర్ 5 క్యాచ్ లు పట్టుకోవడం అరుదుగా చూస్తాం. 5 క్యాచ్ లంటే ఎక్కువగా వికెట్ కీపర్స్ ఈ ఫీట్ సాధిస్తారు. ఇక టీ20 క్రికెట్ లో అయితే ఒక ప్లేయర్ ఐదు క్యాచ్ లు పట్టడం దాదాపుగా అసాధ్యం. అయితే ఐపీఎల్ లో భాగంగా నిన్న (ఏప్రిల్ 28) చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై ఆటగాడు డారిల్ మిచెల్ ఏకంగా 5 క్యాచ్ లు పట్టి ఔరా అనిపించాడు.
213 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ 134 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో బంతి నాకు మిచెల్ అంటే ఇష్టం అన్నట్లుగా అతని దగ్గరకే వెళ్ళింది. మొత్తం 5 క్యాచ్ లతో ఐపీఎల్ లో అరుదైన రికార్డ్ ను సమం చేశాడు. వికెట్ కీపర్ కాకుండా ఒక ప్లేయర్ 5 క్యాచ్ లు పట్టడం ఐపీఎల్ లో ఇది రెండో సారి మాత్రమే. గతంలో ఈ రికార్డ్ మహమ్మద్ నబీ పేరిట ఉంది. 2021 లో నబీ.. ముంబై ఇండియన్స్ పై సన్ రైజర్స్ తరపున 5 క్యాచ్ లు అందుకున్నాడు.
చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మిచెల్.. సన్ రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో పాటు హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్‌ల క్యాచ్ లను అందుకున్నాడు. రూ. 14 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన మిచెల్.. బ్యాటింగ్ లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. అయితే నిన్న మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో పాటు ఫీల్డింగ్ లో సత్తా చాటి 5 క్యాచ్ లు పట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సొంతగడ్డపై తమకు తిరుగులేదని నిరూపిస్తూ సన్ రైజర్స్ ను చిత్తు చేసింది. చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 78 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ 18.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది.