దసరా పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. హిందువులను ఎంతో పవిత్రంగా భావించే మహాభారతం.. రామాయణం గ్రంథాల్లో కూడా దసరా పండుగ గురించి విశేషంగా పేర్కొన్నారు. పాండవులు పాల పిట్టను చూడటం.. రాముడు యుద్దంలో విజయం సాధించిన రోజున దసరా పండుగను భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు. . దసరా రోజు భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకుంటే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు
జమ్మి చెట్టు.. పాలపిట్ట
మహాభారతంలో కూడా విజయదశమి పండుగకు నేపథ్యం ఉంది. పాండవులు. రాజ్యాన్ని విడిచి అరణ్యవాసంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన రోజు.. వాళ్లకు సంబంధించిన ఆయుధాలన్నింటినీ ఒక మూట కట్టి, తిరిగొచ్చే వరకూ వాటిని చూసుకోమని జమ్మి చెట్టుకి కడతారు. అరణ్యవాసం పూర్తయ్యాక వాళ్లు ఆశ్వయుజ మాసంలోని దశమి రోజునే తిరిగొచ్చి తమ ఆయుధాలను తీసుకుంటారు. ఆ తర్వాత కౌరవులపై యుద్ధం చేసి తిరిగి తమ రాజ్యాన్ని పాండవులు దక్కించుకున్న విషయం తెలిసిందే. వాళ్ళు దశమి రోజున జమ్మి చెట్టుకు తిరిగొచ్చినందునే దసరా పండుగను జరుపుకోవడంతో పాటు, ఆ రోజే ప్రత్యేకంగా జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు. అదే రోజు పాండవులు జమ్మిచెట్టుపై ఒక పాల పిట్టను చూశారు. అందుకే దసరా రోజున పాలపిట్టను చూసి, జమ్మి చెట్టుకు మొక్కితే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఆయుధపూజను కూడా ఈ కారణం వల్లనే చేస్తారు.
జమ్మి చెట్టును పూజిస్తూ ఈ స్తోత్రం చదవాలి
శమీ శమయతే పాపం,
శమీ శత్రువినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ,
రామస్య ప్రియదర్శినీ!!
కరిష్యమాణ యాత్రాయా యథాకాలమ్ సుఖం మయా తత్ర నిర్విఘ్న కల్తీత్వం భవ శ్రీరామ పూజితా!!
రామనామమూ ఈ రోజే
దసరాకు రామాయణ నేపథ్యంలో కూడా ఒక పురాణ కథ ఉంది. శ్రీరాముడు లంకలో రావణుడ్ని చంపిన రోజు దశమే. రాముడంటే దేవుడు... రావణుడు రాక్షసుడు. చెడుపై మంచి గెలవడం ఈ కథలో ఉంది. దసరా రోజున రామాలయాలు కూడా రామనామంతో సందడిగా ఉంటాయి. తెలంగాణలోని పెద్ద మైదానాల్లో రావణుడి దహన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అంతెత్తున పది తలల రావణుడి బొమ్మను చేసి, ఆ బొమ్మను బాణాసంచా కాలుస్తారు. ఇది చాలా ప్రాంతాల్లో ఒక పెద్ద సంబరంలానే ఉంటుంది. దసరా తర్వాత ఇరవై ఒక్క రోజులకు దీపావళి వస్తుంది. రావణుడ్ని చంపిన తర్వాత రాముడు తన పరివారంతో అయోధ్యను చేరింది ఆశ్వయుజ మాసం దశమి రోజే.
ఆయుధపూజ
కులవృత్తులు చేసేవాళ్ల దగ్గర్నుంచి, ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధమే వాళ్లకు జీవితాన్నిస్తుంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీది నుంచి తీసిన రోజు దసరానే. అందుకే ఈ రోజున ఎవ్వరికి వాళ్లు తమ ఆయుధాలకు ఆయుధ పూజ చేయిస్తారు. ఆ ఆయుధం అన్నది బండి కావొచ్చు, మెషీన్ కావొచ్చు, రైతులకైతే నాగలి, కొడవలి కావొచ్చు, పిల్లలకు చదువుకునే పుస్తకాలు కూడా కావొచ్చు. ఆయుధ పూజ చేయించడం ద్వారా విజయం మనవైపే ఉంటుందన్నది భక్తుల విశ్వాసం
షాపింగ్ టైమ్ ఇదే!
దసరా ఏ బిజినెస్ కైనా పెద్ద సీజన్. ఈ సీజన్లోనే ఎవ్వరైనా కొత్త బట్టలు, చెప్పులు, ఇంట్లో ఏదో ఒక కొత్త వస్తువు లాంటివి కొంటుంటారు. దాదాపు అందరికీ ఈ సీజన్లో షాపింగ్ అన్నది తప్పనిసరి కాబట్టి రోడ్లు, మార్కెట్లన్నీ కళకళలాడిపోతుంటాయి. చిన్న చిన్న ఊళ్లలో ఉండేవాళ్లు దగ్గర్లోని టౌన్లకి వెళ్లి మరీ షాపింగ్ చెయ్యాలి. ఇంటిల్లిపాదికి బట్టలు కొనాలంటే దానికి డబ్బులు కావాలి. చిన్న ఉద్యోగులకు దసరా పండుగ టైమ్ కే బోనస్లు ఇస్తుంటాయి కంపెనీలు.. ఆ బోనస్ వస్తే వాళ్లకు దసరా షాపింగ్ కి డబ్బులు అందినట్లే. 'దసరా బోనస్' అన్న మాటకోసం ఆ చిన్న ఉద్యోగులు ఎదురుచూసేది కూడా ఈ షాపింగ్ కోసమే.
పండుగంటే పండుగే..
నవరాత్రి ఉత్సవాలు, సద్దుల బతుకమ్మ పండుగ కూడా ముగిశాక దశమి రోజు వచ్చే దసరా పండుగంటే తెలంగాణాలో ఎవ్వరికైనా ప్రతి ఏడాదీ ఒక మరచిపోలేని అనుభూతి. వర్షాకాలం మెల్లగా శీతాకాలానికి వెళ్లే కాలం ఇది. చిన్న చిన్న వానలు పడుతుంటే, పల్లెలకు వెళ్తే ఎక్కడచూసినా పచ్చని చెట్లే కనిపిస్తాయి. అడవి పూల అందాలు ఎక్కడైనా పలకరిస్తుంటాయి. ఎక్కువమంది సొంత ఊళ్లకే వెళ్లిపోతారు కాబట్టి నగరాలు ఖాళీ అవుతుంటాయి.
–వెలుగు, దసరా స్పెషల్–