ఒకప్పుడు దసరా అంటే పద్యాలు.. పాటలు.. దసరా వేషాలతో సందడి సందడిగా ఉండేది. ఓ పక్క బొమ్మల కొలువులు.. పట్నం నుంచి పల్లెలకు చేరే జనాలు.. కొత్త అల్లుళ్లు.. కొంటె మరదళ్లు.. చేసే హడావిడి అంతా ఇంతా కాదు. దసరా మూమూళ్ల కోసం వచ్చే వారు.. ఆత్మీయంగా ఇచ్చే బహుమతులు ఇలా తొమ్మదిరోజుల పాటు ఎంతో భక్తిగా అమ్మవారిని పూజించి ఎంజాయి చేసేవారు. పులి వేషాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే దసరా అంటే స్త్రీ .. పురుషులకు ఉల్లాసం.. పిల్లలకు ఆడవిడువు. ఇలా పూర్వకాలంలో దసరా పండుగను జరుపుకునేవారు.
కాలం చాలా మారింది. ప్రస్తుతం హైటెక్ యుగంలో.. నేటి తరం వారు పండుగలంటే కేవలం హాలిడేస్ అనే విధంగా తయారైంది. అయితే పూర్వ కాలంలో దసరా పండుగను ఎలా పండుగ చేసుకునేవారో ఈ తరానికి చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే.. సంప్రదాయాలు.. ఆచారాలు ఈ తరానికి తెలియడం లేదు. పెద్దలకు గుర్తు చేయాల్సిన బాధ్యత కూడా ఉంది.
గతంలో స్కూల్ టీచర్ పిల్లలను వెంట పెట్టుకుని అయ్యవార్లు బయలుదేరేవారు .గ్రామంలో పెద్దల ఇళ్లకు వెళ్లి మామూళ్లు స్వీకరించేవారు. ఏ దయా మీ దయా మా మీద లేదు ఇంత నిర్లక్ష్యమా ఇది మీకు తగదు పావలా అర్ధయితే పట్టేది లేదు ముప్పావులా అయితే ముట్టేది లేదు హెచ్చు రూపాయయితే పుచ్చుకుంటాము అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు’… అంటూ పద్యాలు పాడేవారు.
స్కూల్ టీచర్లు పాఠశాల అభివృద్దికి చందాలు వసూలు చేసేవారు. బడి అభివృద్దికి చందాలు.. అయ్యవార్లకు మామూళ్లు ఇచ్చేవారు. ఆ సమయంలో గురు ఆశీర్వాదం ఇచ్చేవారు. వరహా అంటే మూడున్నర రూపాయి. దసరా కోసం పిల్లలు ఎదురు చూసేవారు. ఆ సమయంలో పిల్లల్ని బంధువుల వద్దకు పంపుతామనే హామీ ఉండేది. అవ్వా, తాతల దగ్గరికో, బాబాయి దగ్గరికో, మేనత్త ఊరికో నాలుగు జతలు పెట్టుకుని పిల్లలు ఉత్సాహంగా వెళ్లేవారు. దసరా సెలవులు హాయిగా గడిపేవారు.
ఇప్పటి మాదిరిగా అప్పుడు పేరెంట్ ... టీచర్స్ మీటింగ్‌లు ఉండేవి కావు.. ఆ ఏడాది ఆ సంవత్సరంలో నేర్పిన విద్యను దసరా సెలవుల్లో పెద్దల ముందు అయ్యవార్లు పిల్లల చేత ప్రదర్శింపచేసేవారు. దీనిని ప్రాక్టికల్‌గా చూసిన తల్లి దండ్రులు.. గ్రామ పెద్దలు పిల్లల తెలివితేటలకు ముచ్చట పడేవారు. ఎంతో నైపుణ్యం ఉండి.. పై చదువులు చదవించలేని తల్లి దండ్రులను గ్రామ పెద్దలు భరోసా కూడా కల్పించేందుకు విద్యార్థుల సత్తా తెలిసేది.
హిందువుల పండుగల్లో ప్రతి పండుగ ఏదో ఒక ప్రాముఖ్యతను కలిగిఉంటుంది. ప్రస్తుతం దసరా నవరాత్రిళ్లు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాల్లో దసరా వేషాలు..పులి డ్యాన్స్.. వివిధ రకాల నృత్యాలు ఇలా ఒకటేమిటి... అంతా సంబరమే.. మరో పక్క పోలీసుల గన్ లకు పూజలు.. జమ్మిచెట్టుకు పూజలు చేస్తూ.. తెలంగాణలో బతుకమ్మ ఆడటం .. కొన్ని ప్రాంతాల్లో నాటకాలు వేయడం.. మరికొన్ని ప్రాంతాల్లో దాండియా ఆడటం చేస్తున్నారు.
దసరా వేషాలు
పూర్వకాలంలో దసరా పండుగ అంటే వేషాలు వేసేవారు. పిల్లలకు అనేక రకాలైన వేషాలు వేసి ప్రదర్శించచేసేవారు. చాలామంది కళాకారులు పురాణ వేషాలు కట్టి ఇళ్ల ముందుకు వచ్చి కానుకలు స్వీకరించేవారు. అప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు ఈ వేషాలు వేసేందుకు ఆశక్తి చూపేవారు. ఎంతో సరదాగా ఈ వేషాలు చూస్తూ ఎంజాయి చేసేశారు. సీతారాములు, హనుమంతుడు, నారదుడు, శివుడు, అర్ధ నారీశ్వరుడు… ఇక పులి వేషాలు తప్పనిసరి. ఆ రోజుల్లో పులిని చూడటం అరుదు కాబట్టి (సినిమాల్లో తప్ప) మనిషే పులి రూపు కట్టి ఎదురు పడితే అబ్బురపడేవారు.
తప్పెట్ల మోతకు వేషగాళ్లు లయబద్ధంగా ఆడుతుంటే నోరు తెరిచి చూసేవారు. నేలన పడేసిన రూపాయి కాసునో నిమ్మకాయనో పులి వేషగాడు నోట కరవడం ఒక ఘట్టం. దసరా నవరాత్రులు వైభవంగా జరుగుతాయి కదా. అలా ఎవరైనా ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటే ‘దసరా బుల్లోడు’ అనడం ఆనవాయితీ. ఇలాడదసరా పండుగకు ప్రతి పట్టణంలో, గ్రామంలో దుర్గ అమ్మవారి మండపాలను ఏర్పాటు చేసి తొమ్మిది రోజులు అమ్మవారి అవతరాలను అద్భుతంగా అలంకరించి ఘనంగా నవరాత్రులను నిర్వహిస్తారు. చివరి రోజు అమ్మవారిని ఊరేగిస్తారు. అమ్మవారి ఊరేగింపులో భాగంగా భేతాల వేషాలను కూడా ఏర్పాటు చేస్తారు.
–వెలుగు, దసరా ప్రత్యేకం–