మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో ఘనంగా దాశరథి శత జయంతి

మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో ఘనంగా దాశరథి శత జయంతి
  • హాజరైన నేతలు, కవులు, కళాకారులు

మహబూబాబాద్, వెలుగు : మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి వేడుకలను మహబూబాబాద్‌‌‌‌ జిల్లా చిన్నగూడూరులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌‌‌‌రావు అధ్యక్షతన మహబూబాబాద్‌‌‌‌లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌‌‌‌, డోర్నకల్‌‌‌‌ ఎమ్మెల్యే జాటోతు రామచంద్రునాయక్‌‌‌‌, మహబూబాబాద్‌‌‌‌ ఎమ్మెల్యే మురళీనాయక్‌‌‌‌, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌‌‌‌, ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామచంద్రునాయక్‌‌‌‌ మాట్లాడుతూ దాశరథి కృష్ణమాచార్యుల జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు. నిజాం అరాచకాలను చూడలేక కవిగా, ఉద్యమకారుడిగా అనేక పద్యాలు, పాటలు, కవితలతో సమాజాన్ని జాగృతం చేశారని కొనియాడారు. ఇది నచ్చని నిజాం దాశరథిని నెల్లికుదురు పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో నిర్బంధించి వేధింపులకు గురి చేయగా అక్కడి నుంచి తప్పించుకున్న దాశరథిని మళ్లీ అరెస్ట్‌‌‌‌ చేసి నిజామాబాద్‌‌‌‌ జైలులో నిర్బంధించినట్లు గుర్తు చేశారు.

దాశరథి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మహబూబాబాద్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పాల్వాయి రామ్మోహన్‌‌‌‌రెడ్డి, టీఎన్జీవోస్‌‌‌‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర అధ్యక్షుడు విరహత్‌‌‌‌ అలీ, గునిగంటి కమలాకర్, రాజేశ్‌‌‌‌, గాడిపెల్లి మధు పాల్గొన్నారు.

దాశరథి ఒక అగ్నిధార : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్

దాశరథి కృష్ణమాచార్యులు కవితలు నిప్పు కణికల్లాంటివని, రుద్రవీణ, అగ్ని ధార వంటి ఎన్నో రచనలు చేశారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌‌‌‌ చెప్పారు. నిజాం అరాచకలు ప్రజలకు తెలిసేలా పద్యాలను, పాటలు రచించి సమాజ హితం కోసం పని చేశారన్నారు. దాశరథి జీవిత చరిత్రను సిలబస్‌‌‌‌లో చేర్చడంతో పాటు ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై విగ్రహం పెట్టాలని, జయంతి వేడుకలు సంవత్సరం పాటు నిర్వహించాలని కోరారు. దాశరథి రాసిన ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ వాక్యం తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిందన్నారు.

దాశరథి జీవిత చరిత్ర మరువలేనిది : రచయిత నందిని సిధారెడ్డి

తెలంగాణ పదజాలం, మాండలికాన్ని అనుసరించి నాటి పరిస్థితుల్లో అన్ని వర్గాలను జాగృతం చేసేందుకు దాశరథి రచనలు చేసినట్లు చెప్పారు. ఆయన జీవితంలోని ప్రధాన ఘట్టాలను నేటి తరానికి వివరించాలని సూచించారు. కవులు, రచయితలు ప్రజల పక్షాన నిలిచినప్పుడే సమాజంలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.