తెలంగాణ బుర్రవీణకు..దక్కిన గౌరవం

తెలంగాణ బుర్రవీణకు..దక్కిన గౌరవం

బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప. ఇతని వయస్సు 70 ఏళ్లు. ఈయన తెలంగాణలోని నారాయణపేట జిల్లా  దామరగిద్దె గ్రామానికి చెందిన వ్యక్తి. మాల దాసరి/దండ దాసరి (దళిత) కులానికి చెందినవారు. వీళ్లు మాలలకు ఆశ్రితులు. అందుకే వీరిని ఆశ్రిత కుల వ్యవస్థలో భాగంగా చూడాలి. ఈ కళాకారుడు వాయించే తంత్రీ వాయిద్యం పేరు బుర్రవీణ. జానపద సాహిత్య కళారూపాలు సామాజిక విజ్ఞానానికి ఆధార గ్రంథాలు వంటివి. బుర్రవీణ ఏక్తారా, తాంబూర కుటుంబా నికి చెందినది. ఇది 'భూమి వీణ', 'విల్లాడి వాయిద్యాన్ని' పోలినట్టుగా ఉంటుంది. కొండప్ప కన్నడం, తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో పాటలు పాడుతారు.  అందులో జ్ఞాన తత్వం, ఆత్మ తత్వాలకు సంబంధించిన గీతాలు ఉంటాయి. ఈ వాయిద్యంలో 24 రకాల స్వరాలు పలికించగలనని కొండప్ప చెప్పాడు.

కొండప్ప మాలలని  ఆశ్రయించి తత్వగీతాలు, భాగవత, రామాయణ గీతాలు, బతుకమ్మ పాటలు, సత్య హరిశ్చంద్ర, భక్తిపాటలు, వీర బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలు, మన్యంకొండ హనుమద్దాసు కీర్తనలు పాడతాడు. తన వాయిద్యాన్ని చేతితో మొక్కి దండం పెట్టుకొని పాటను ఎత్తుకుంటాడు.  ఈయన నిరక్షరాస్యుడు అయినా వందలాది మందికి చెప్పే సత్తా తనకు ఉన్నది. ఈయనకు కీర్తిశేషుడైన తండ్రి వాయిద్యం నేర్పిస్తే, వాళ్ల అన్న గీతాలను వారసత్వంగా అందించారు. కథను మొత్తం మౌఖికంగా చెబుతాడు. ముగింపులో గోవింద నామంతో ఆయనకు ఇష్టమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని తలుచుకొని ముగిస్తారు. ఇలాంటి సంగీత కారుడు తెలంగాణలో  దాసరి కొండప్ప ఒక్కడే సజీవంగా ఉన్నారు. 

బుర్రవీణ తయారీ

బుర్రవీణను తయారు చేసేటప్పుడు ముందుగా ముదురు సొరకాయని కానీ, గుమ్మడికాయని కానీ ఎన్నుకుంటారు. ఈ కాయలు ముదురు అవ్వడానికి చెట్టుమీద సుమారు 8 నెలలు లేదా ఒక సంవత్సరకాలం పడుతుంది. తెంపిన ఈ కాయలు ఆరడానికి 2నెలలు పడుతుంది. బీటలు పడకూడదు. ఎందుకంటే బుర్రలు బీటలు వారితే నాదం పలకదు. బుర్ర ఎండిపోయిన తర్వాత దాని లోపలి గింజలు తీసి ఒక వెదురు బొంగు కర్రను తెచ్చి దానిని సొరకాయ లేదా గుమ్మడికాయ బుర్రలోకి అమర్చి బుర్ర మీద ఒక చెక్కు మెట్టుని మైనంతో పెట్టుకొని మూడు ఇనుప తీగలు కడతారు. తీగలు వివిధ రకాల నాదాలు రావడానికి వీలుగా చీట్టెలు, మామిడి కలపతో తయారుచేసిన కొమ్ములను చివరి బొంగు కర్రకు బిగిస్తారు. మీటడానికి వెదురు బద్ద పుల్లలతో ఒక వెదురు పుల్లకు గుండ్రటి ఆకారంలో తీగతో గజ్జలు కట్టి ఇంకోపుల్లను ఆ గజ్జల కొప్పుకు బిగిస్తారు.ఈ పరికరాలన్నీ సహజంగా ప్రకృతి నుంచి వచ్చినవి. వాళ్ళు నివసించే ప్రాంతమైన నల్లమల అడవులలో ఇవి దొరుకుతాయి. కొండప్ప ఈ వాయిద్యాన్ని తానే స్వయంగా తయారు చేసుకుంటాడు.

బుర్రవీణ, కళాకారుని అలంకరణ

వాయిద్యం బుర్రకు తెల్లని విభూతి, కుంకుమ నామాల బొట్లతో అలంకరిస్తాడు దాసరి కొండప్ప. తెల్ల పంచె, అంగి వేసుకొని, నెత్తికి రుమాలు చుట్టుకొని నుదుటి మీద నామాల బొట్టు పెట్టుకొని ఎడమ భుజం మీద కండువా వేసుకొని ఇతను నేలమీద పరిచిన చాపపై కూర్చొని పాటను ప్రారంభిస్తాడు. వాయిద్యానికి చూడముచ్చటైన రూపంతో అలంకరణ చేస్తాడు. ఈ అలంకరణతో తన కులాల వాళ్ల ఇండ్లకు సంచరిస్తూ ఉంటాడు. మాల దాసరులు వైష్ణవ భక్తిని ప్రచారం చేస్తారు. 2016వ సంవత్సరంలో ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు బృందం బుర్రవీణ కళాకారుణ్ని గుర్తించి సమాజానికి పరిచయం చేశారు. నైపుణ్యం గల కళాకారుడిగా కీర్తించారు. ఆయన బుర్రవీణ మీద వ్యాసాలు రాశారు.

ఆద్యకళా ప్రదర్శనలు అనేకం

2021వ సంవత్సరం ఆగస్టు 15న ఈ వాయిద్యాన్ని మరోసారి మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఆద్యకళ  ప్రదర్శనలో పెట్టడం జరిగింది. ఈ ప్రదర్శన ద్వారా చాలామంది మేధావులు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, సినిమా వాళ్లు గుర్తించే అవకాశం లభించింది. 2023 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొ. జయధీర్ తిరుమల రావు  తోవ్వ ముచ్చట్లు 7వ భాగం పుస్తకావిష్కరణ దాసరి కొండప్ప చేతుల మీదుగా జరిగింది. బలగం సినిమాలో బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​లో తన గానాన్ని వినిపించారు. మ్యూజిక్ డే సందర్భంగా ఆద్య కళాబృందం సాలార్జంగ్ మ్యూజియంలో బుర్రవీణ వాయిద్యం ఆకర్షణగా నిలిచింది. ఇదే సంవత్సరంలో చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్ లో ఇండో ఫ్రెంచ్ సంగీత సంగమంలో తెలుగు జానపద పాటలకు గుబాళింపులో భాగంగా సుకాంత బోస్, శాంతినికేతన్ (వోకల్స్), అలెగ్జాండ్ర జూరైన్ ఫ్రాన్స్( ఎస్రాజ్ ), ఉస్తద్ నజ్ముద్దీన్ జావిద్ హైదదాబాద్​ (తబలా),  దాసరి కొండప్ప దామరగిద్దె (బుర్రవీణ) స్వరంతో  వీళ్ళందరూ కలిసి బృందగానం సుమారుగా 2 గంటల పాటు ప్రదర్శన చేశారు. ఇతను పాడిన పాటల లిరిక్స్ ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేషన్ చేసుకున్నారు. భారతదేశంలో తెలంగాణకు చెందిన కళాకారుడు వీళ్లతో కలిసి ప్రదర్శించడం అనేది చాలా గౌరవప్రదమైంది. జానపద కళల చరిత్రలో మరపురానిది.

అరుదైన గౌరవం లభించింది

బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప చిన్నకొండపైన చిల్లులు పట్టిన రేకుల ఇంట్లో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. పాటలు పాడడం వల్ల పొట్ట గడవడం లేదు. కుటుంబ సభ్యులు కూలి నాలి చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వచ్చే తరానికి తెలియజేయాలంటే అంతరించిపోతున్న ఈ కళకు చాలా శిక్షణ శిబిరాలు జరగాల్సి ఉన్నాయి.  ఎంత ఆధునికీకరణ జరిగినప్పటికీ దానికి అనుకూలంగా నేర్పించే ఓపిక, సృజనాత్మకత కళాకారుడు దాసరి కొండప్పలో ఇంకా ఉన్నది. ఎందుకంటే చిన్నపిల్లలకు నేర్పించినప్పుడు తనలాంటి గాయకుడిని తయారు చేయగలను అనే ఆశయంతో నిరీక్షిస్తున్నాడు. సాంస్కృతిక ప్రభుత్వ రంగ సంస్థల అవార్డులను కొండప్ప అనేకం అందుకున్నారు.  దేశం గర్వించదగ్గ తెలంగాణ  బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పను   కేంద్ర ప్రభుత్వం గుర్తించి,   ఆయనకు ‘పద్మశ్రీ’ అవార్డు ప్రకటించి గౌరవించడం అన్నిటికీ మించిన హర్షించదగ్గ విషయం. 

- జంపాల ప్రవీణ్,​ తెలుగు శాఖ విద్యార్థి, తెలుగు యూనివర్సిటీ,  హైదరాబాద్