తెలంగాణలో పుట్టి తెలంగాణ కోసం అంకితభావంతో కృషి చేసి, అనారోగ్యం వేధిస్తున్నా, లాఠీ దెబ్బలు బాధిస్తున్నా తుదిశ్వాస వరకు తెలంగాణ నినాదాన్ని వదలకుండా జీవించిన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్య. తండ్రి పరమ ఛాందసుడైనా అడ్డంకులన్నింటినీ దాటుకుంటూ.. అప్పటి రాచరిక వ్యవస్థను నిర్భయంగా ఎదురించారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న ఆయన మాట నిజామాబాద్ జైలు గోడలు దాటి బయటి ప్రపంచాన్ని చైతన్యపరిచి విశ్వవ్యాప్తమైంది.
కవులలో మేరునగధీరుడై, కాళోజీ వంటి వైతాళికులకు అనుంగ తమ్ముడయ్యాడు దాశరథి కృష్ణమాచార్య. 27 ఏండ్ల యువ ప్రాయంలోనే ‘మహా కవి’ బిరుదుకు యోగ్యుడయ్యాడు. ఆయన రాసిన అగ్నిధార, రుద్రవీణ పద్య కావ్యాలు మహా కావ్యాలన్నంత కీర్తిని గడించాయి. తొలినాళ్ల నుంచి దాశరథి రైతు పక్షపాతి. ‘... పొలాలు దున్ని, బోషాణములన్నవాబునకు స్వర్గము నింపిన రైతుదే, తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంపు దక్కునే’ అంటారు ధైర్యంగా.. నిజాం నిరంకుశ పాలన కాలంలో ‘ముసలి నక్క’ అనగలిగినవాడు ఎంత సాహసి అయి ఉంటాడో మనం ఇప్పుడు ఊహించుకోవచ్చు. ‘జెండా ఒక్కటే మూడు వన్నెలది, దేశంబొక్కటే భారతా ఖండాసేతు హిమాచలోర్వర’ అంటూ.. జాతీయ భావాన్ని తెలుగునాట వ్యాపింపజేశారు దాశరథి. పోతన కవీశ్వరుడంటే దాశరథికి అపార గౌరవం. ‘నేను పోతన కవీశాను గంటములోని ఒడుపులు కొన్నింటి ఒడసినాను’ అంటారు. ఆయన పద్యకవిత్వంలోని ధార, శైలీనైగనగ్యము ఇతర కవులలో కానబడదు. ఈ భాషా పటిమ, భావధారలను తాను పోతన కవిత్వం నుంచి నేర్చుకున్నానని దాశరథి సవినయంగా చెప్పుకున్నారు. దాశరథి గేయకవిత్వంలో కూడా వైదగ్ధ్యం కవులను ప్రభావితం చేశారు. ప్రకృతి వర్ణనలతో పులకింపజేస్తారు.
‘విరబూచిన మామిడిపై
స్వరమెత్తెను కోకిలలు
విరి జుంపము దాపులలో
వినిపించెను కిలకిలలు’
అంటూ నాలుగు పాదాలలో సమతూగును పాటిస్తూ, అంత్య ప్రాసలను ప్రదర్శిస్తూ, మామిళ్ల మీద కోకిలల గానాలను, వీటికి సాటిగా లతానికుంజములో ప్రేయసీ ప్రియుల నవ్వులు వినిపిస్తున్నాయంటున్నారు. ప్రకృతి వర్ణనను, మానవ ప్రకృతితో అనుసంధానం చేసి మైమరపు కలిగిస్తారు దాశరథి. అందుకే అంగారంతోపాటు శృంగారాన్ని కూడా పోషించగలిగిన ఏకైక ఆధునిక కవి కాగలిగారాయన. అందరూ కృష్ణా గోదావరుల మీద కవిత్వం రాస్తారు. కానీ ఎవరూ పట్టించుకోని మంజీర మీద దాశరథి ఇలా రాశారు.
‘ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర
ఎవరి కజ్జల బాష్పధారవే మంజీర
నీవు పారిన దారిలో ఇక్షు దండాలు
నీవు జారిన జాడలో అమృత భాండాలు’
అంటూ తెలంగాణను సస్యశ్యామలం చేసిన నదీమతల్లిగా మంజీరను దాశరథి వర్ణించారు. తెలుగునాట ఇప్పుడెందరో రుబాయిలను రాస్తున్నారు. అయితే మొట్టమొదటిసారి రుబాయిలను తెలుగులో రాసిన వారు మాత్రం దాశరథే. ఆ తర్వాత సినారె, సదాశివ, ఏనుగు నరసింహా రెడ్డి వంటి వారు రాసి సుప్రసిద్ధులయ్యారు. దాశరథి రాసిన రుబాయిల్లో ఇదొకటి.
‘నింగి కితాబుగ చేశాను
చుక్కల హిసాబు వేశాను
ప్రేయసి కోసం వేచివేచి
తుదకు మంచమే నేశాను’
ప్రేయసికోసం ఎదురుచూపులో చుక్కలుకూడా లెక్కించాడట. ఆమె రాలేదు. లాభం లేదని వాస్తవిక ప్రపంచంలోకి వచ్చి పనికొచ్చే పని చేశాడట. అది మంచం నేయటం! ఇందులోని శృంగారాన్ని విజ్ఞులు గమనిస్తారు. అట్లే హాస్య దృష్టికి నవ్వుకుంటారు. దాశరథి కథల్లో తెలంగాణ జీవితం ఉంటుంది. అప్పటి రైతాంగ పోరులో
పాల్గొన్న వారు ఉంటారు. వారి కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు ఉంటారు. చివరకు రాచరికం మీద ప్రజాస్వామ్యానిదే గెలుపు అవుతుంది. ఉర్దూ మహాకవి గాలిబ్అంటే దాశరథికి పంచప్రాణాలు. ‘గాలిబ్ గీతాలు’ పేరుతో ఆ మహాకవి కవితలను ప్రచురించి అక్కినేని నాగ్వేశ్వరరావుకు అంకితం చేశారు. ఆ మహాకవి కవితలను దాశరథి అనువాదాల్లో కొన్ని రుచి చూస్తే..
‘ఎంత తీయని పెదవులే ఇంతి నీవి?
తిట్టుచున్నప్పుడు గూడ తీపి కురియ’
అంటూ వ్యంగ్య వైభవాన్ని రగిలిస్తాడట.
‘నేను గుడి పక్క గేహమ్ములోన నుంటి
బ్రహ్మకే నేను పొరుగింటి వాడనైతి’
తన మిథ్యా గొప్పదనాన్ని హాస్య చతురతతో వర్ణిస్తాడు. తన కవిత్వంతో ‘మహా శిల్పి జక్కన’ అద్దాలమేడ(అనువాదం) వంటి నవలలతో, నాటికలతో, వ్యాసాలతో దాశరథి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి చిరస్మరణీయులయ్యారు.
స్నేహం విలువను చాలా మంది చాటి చెప్పారు. అయితే దాశరథి ప్రదర్శించినన్ని కోణాలు మరెవరూ ప్రదర్శించలేదు.
‘దోస్తీని మించింది లేదు లోకాన
రత్నాల కంటె అది మిన్న తూకాన
మిత్రుడే కావాలి సుఖాన శోకాన
అతడు లేకున్నచో నగరమే కాన’
అంటూ ఒక గొప్ప జీవిత సత్యాన్ని చెప్పి భర్తృహరిని తలపింపజేస్తాడు.
- డా. గంటా జలంధర్ రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి.