మూసీ నిర్వాసితులను వెళ్ల గొట్టడం హక్కుల ఉల్లంఘనే: దాసోజు శ్రవణ్

మూసీ నిర్వాసితులను  వెళ్ల గొట్టడం హక్కుల ఉల్లంఘనే: దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుగు: మూసీ సుందరీకరణలో భాగంగా లక్షలాది మంది నిరుపేద కుటుంబాలను బలవంతంగా వెళ్లగొట్టడం ప్రజా హక్కుల ఉల్లంఘనేనని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. మూసీ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలని ఆయన డిమాండ్ ​చేశారు. సర్కారు రూ.1.5 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిపాదించినప్పటికీ.. ప్రాజెక్టు అమలులో లక్షలాది మంది నిరుపేద కుటుంబాల ఇండ్లను కూల్చివేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మూసీ నది ప్రాజెక్టు, జీవో నం.477 పై ప్రభుత్వానికి లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరహాలో బుల్డోజర్ విధానాన్ని అనుసరిస్తోందని మండిపడ్డారు. 

మూసీ నది పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలను రాత్రికి రాత్రే బలవంతంగా వెళ్లగొడుతూ వారి ఇండ్లను కూల్చివేయడం.. ఇందిరా గాంధీ ఇచ్చిన రోటి, కపడా, మకాన్ హామీని తారుమారు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణవేత్తలు, పట్టణ ప్రణాళికాకర్తలు,  ప్రభావిత వర్గాలతో సరైన స్థాయిలో సంప్రదింపులు జరపకుండా మూసీ నది ప్రాజెక్టును చేపట్టడం ప్రజాస్వామ్య పద్ధతులను తారుమారు చేసే చర్య అని శ్రవణ్ విమర్శించారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవనోపాధిపై ఇది ప్రభావాన్ని చూపుతుందని వివరించారు. వెంటనే జీవో నం. 477ను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.