నిఖార్సయిన కార్మిక నేత కాకా

అశేష ప్రజానికంతో ‘కాకా’ అని పిలిపించుకుని, గుడిసెల వెంకటస్వామిగా పేదల గుండెల్లో  కొలువైన కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి కార్మిక నేతగా, పీడిత జన పక్షపాతిగా చిరస్మరణీయుడు. ఆయన సేవలు ఒక వర్గానికో, కులానికో, ప్రాంతానికో పరిమితమైనవి కావు. అన్ని వర్గాలకు ఆయన ఆపద్బాంధవుడే. నిజాం జమానాలో ఆర్యసమాజ్​ ప్రేరణతో, స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో గొప్ప నాయకుడిగా ఎదిగి వచ్చి రాజకీయాల్లో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని కొనసాగించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆర్థిక, హార్థిక, రాజకీయ సహకారం అందించిన మహానేత మన కాకా. 

టెక్స్​టైల్​ ఇండస్ట్రీకి ఎనలేని సేవలు
సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడంపైనా, ఖాయిలాపడిన బట్టల మిల్లులను బతికించడంపైనా కేంద్ర జౌళీ శాఖా మంత్రిగా వెంకటస్వామి ఎనలేని కృషి చేశారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రగడ కోటయ్య లాంటి చేనేత నాయకులతో చర్చించి చేనేత కార్మికులకు స్వాంతన కలిగించే నిర్ణయాలు  తీసుకున్నారు. చేనేత రంగాన్ని ఆదుకోవచ్చని, మూతపడే స్థితిలో ఉన్న మిల్లులను బతికించడం ద్వారా లక్షలాది కుటుంబాలను ఆదుకోవచ్చనే ఆలోచనతో ఆయన పీవీ కేబినెట్‌‌‌‌లో  గ్రామీణాభివృద్ధి శాఖతోపాటు టెక్స్‌‌‌‌టైల్స్‌‌‌‌ శాఖ మంత్రిగానూ బాధ్యతలు చేపట్టారు.1993లో ఆయన టెక్స్‌‌‌‌టైల్స్‌‌‌‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఈ రంగం క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉండేది. నాడు ఆయన అనేక సంస్కరణలను తెచ్చారు. చేనేత రంగ సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పట్లో కాకా చొరవతో టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ ఇండస్ట్రీ పరిస్థితి మారిపోయింది. ఐదు జాతీయ స్థాయి ట్రేడ్‌‌‌‌ యూనియన్లు, టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ మిల్లుల యజమానులను పిలిచి త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేయించారు. దేశవ్యాప్తంగా నష్టాల్లో  ఉన్న 79 మిల్లులను ఒక్క తాటిపైకి తెచ్చి నేషనల్‌‌‌‌ టెక్స్‌‌‌‌టైల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ ఏర్పాటు చేయడంలో కీ రోల్‌‌‌‌ ప్లే చేశారు. మోడర్నైజేషన్‌‌‌‌కు పెద్ద పీట వేశారు. 

పెన్షన్​ స్కీమ్ ​ఘనత ఆయనదే..
చిన్నతనంలోనే తండ్రి మరణంతో కుటుంబ భారాన్ని మోయడానికి ఆయన భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. కార్మికుల బాధలు కళ్లారా చూడటం వల్ల తుది శ్వాసవరకు కష్ట జీవులు, కార్మికుల పక్షాన నిలబడ్డారు. కార్మిక మంత్రిగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కార్మికుల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు పెన్షన్ సదుపాయం తెచ్చింది కాకానే. ప్రైవేట్ రంగ కార్మికులకు పెన్షన్ కల్పించడం ప్రపంచంలోనే మొదటిసారి. ఈ ఘనత కాకాదే. ఆయన కృషివల్ల ప్రస్తుతం రూ.1000కి తగ్గకుండా పెన్షన్ అందుతున్నది. కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల కోసం పెన్షన్ పథకం ఏర్పాటు చేశారు. దాన్ని ఇతర గనుల్లో పనిచేసే కార్మికులకూ అమలు చేయించారు.

నిఫ్ట్​ ఏర్పాటుకు కృషి..
నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను డిజిన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ పేరుతో తెగనమ్ముతున్న రోజుల్లో, వాటిని బతికించేందుకు కాకా ఎంతో ప్రయత్నించారు. ఎన్‌‌‌‌టీసీ మిల్లుల ఉత్పత్తులను అమ్మేందుకు దేశవ్యాప్తంగా షోరూమ్‌‌‌‌లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన కాకా సాబ్‌‌‌‌దే. ఆకర్షణీయమైన డిజైన్లు ఉంటే తప్ప మార్కెట్‌‌‌‌ చేయడం సాధ్యం కాదని గుర్తించి నేషనల్‌‌‌‌ ఇన్​స్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఫ్యాషన్‌‌‌‌ టెక్నాలజీ (నిఫ్ట్​) సంస్థల విస్తరణకు చర్యలు తీసుకున్నారు. కాకా వల్లే  హైదరాబాద్‌‌‌‌లోనూ నిఫ్ట్‌‌‌‌ ఏర్పాటైంది. దళితులు, బడుగువర్గాల్లో చైతన్యం  కోసం, వారి భవిష్యత్తును బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేసిన కాకా నిఖార్సయిన బహుజన నాయకుడు. - దాసు సురేశ్, కన్వీనర్, బీసీ రాజ్యాధికార సమితి