బీఆర్ఎస్ ను విమర్శించేటోళ్లు మూర్ఖులే
చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్
కాజీపేట, వెలుగు: టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని, బీఆర్ఎస్ ను విమర్శిస్తున్న వాళ్లంతా మూర్ఖులని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కాజీపేటలో నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో మీటింగ్ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు దాటినా మన దేశం ఇంకా వెనుకబడే ఉందని, మార్పు కోసమే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నారని తెలిపారు. ఇతర పార్టీల నాయకులు భయాందోళనకు గురై చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఆవిర్భావం సమయంలోనూ కేసీఆర్ పై అనేక విమర్శలు చేశారని, అయినా మొక్కవోని దీక్షతో తెలంగాణ తీసుకొచ్చారని చెప్పారు. గులాబీ సైనికుడిగా బీఆర్ఎస్ నిర్మాణం కోసం ఇతర రాష్ట్రాల్లో కూ డా బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, టీఆర్ఎస్ లాగానే బీఆర్ఎస్ సిద్ధాంతాలను కూడా గడపగడపకూ తీసుకెళ్తామన్నారు. మునుగోడులో బీఆర్ఎస్ విజయం తథ్యమన్నారు.
అంతటా సంబురాలు..
వెలుగు నెట్ వర్క్: సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను ప్రకటించడం పట్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరిపారు. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. పలు చోట్ల పటాకాలు కాల్చారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ ను కలిసి బొకే అందజేసి, అభినందనలు తెలిపారు.
కరెంట్ సంక్షోభంపై గవర్నర్ నోరు విప్పాలి
నర్సంపేట, వెలుగు: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కరెంట్సంక్షోభంపై లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ నోరు విప్పాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు విశేష అధికారాలు ఉంటాయని, దీనిపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. నర్సంపేట టౌన్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గురువారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్ల క్రితమే గిరిజన యూనివర్సిటీకి రాష్ర్ట ప్రభుత్వం 350 ఎకరాల భూమి ఇచ్చినా.. కేంద్రం స్పందించలేదని, దీనిపై గవర్నర్ ఎందుకు ప్రశ్నించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన హక్కుల విషయంపై గవర్నర్ ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలన్నారు. మీటింగ్‌లో మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనీ కిషన్, బీఆర్ఎస్ టౌన్ప్రెసిడెంట్ నాగెల్లి వెంకటనారాయణ, దార్ల రమాదేవి ఉన్నారు.
మొలుగూరికి ప్రత్యేక ఆహ్వానం
పరకాల, వెలుగు: పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి ఈ నెల 9న బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో.. గురువారం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పెసరు విజయచందర్‌రెడ్డి ఆయనకు సాదర స్వాగతం పలికారు. మొలుగూరి నివాసానికి వెళ్లి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచం గురుప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పీ జయంత్‌లాల్, జిల్లా కార్యదర్శి ఎర్రం రామన్న, కౌన్సిలర్ కొలనుపాక భద్రయ్య,జాతీయ కౌన్సిల్ మెంబర్ మేకల రాజవీరు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా దసరా
వెలుగు నెట్ వర్క్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. తొర్రూరు పట్టణంలోని శక్తిస్థల్‌లో నిర్వహించిన రావణవధ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ములుగులో ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో రావణాసురవధ నిర్వహించారు. ఏటా ముఖ్య అతిథిగా హాజరయ్యే గుజ్జుల నర్సయ్య సార్ కు నివాళి అర్పించారు. అనంతరం రావణాసురుడి ప్రతిమను దహనం చేశారు. కార్యక్రమంలో ఓఎస్డీ గౌష్ ఆలం, ఏఎస్పీ సుదీర్ రాంనాథ్‌కేకన్, జడ్పీటీసీ సకినాల భవానీ, ఉత్సవ సమితి అధ్యక్షుడు గండ్రకోట కుమార్హాజరయ్యారు. నర్సంపేట పట్టణంలోనూ రావణవధ ఘనంగా నిర్వహించగా.. బతుకమ్మ వేడుకల్లో ఉత్తమ విజేతలకు మున్సిపల్ చైర్ పర్సన్ గుండి రజనీ కిషన్ బహుమతులు అందజేశారు. కమలాపూర్, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల్లోనూ రావణవధ జరిగింది.
దద్దరిల్లిన ఉర్సు..
వరంగల్ లోని ఉర్సు రంగలీలా మైదానంలో రావణవధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎకో ఫ్రెండ్లీ బాణసంచాలు, లేజర్ లైట్లతో గ్రౌండ్ అంతా కలర్ ఫుల్ గా మారింది. నగర ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి, ప్రోగ్రాంను వీక్షించారు. అలయ్.. బలయ్ ఇచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్ గోపి, మేయర్ సుధారాణి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు బీజేపీ నాయకులు రామరథాన్ని నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
అధ్వానంగా జనగామ-సిద్దిపేట హైవే
జనగామ, వెలుగు: జనగామ– సిద్దిపేట హైవే అంటేనే ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. అడుగుకో గుంతతో రోడ్డంతా అధ్వాన్నంగా మారి ప్రయాణం నరకప్రాయమైంది. ఆ రూట్ లో వెళ్లిన వాహనదారుల నడుములు విరుగుతున్నాయి. గత మూడేండ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా.. ఆఫీసర్లు మాత్రం స్పందించడం లేదు. విస్తరణ పనుల పేరుతో రోడ్డు రిపేర్లను తీవ్ర ఆలస్యం చేస్తున్నారు.
వైడెనింగ్ కు, రిపేర్లకు లంకె..
నిత్యం గుంతమయంగా ఉండే ఈ హైవేను విస్తరించాలని గతేడాది ప్రభుత్వం నిర్ణయించింది. జనగామ నుంచి దుద్దెడ రోడ్డు వరకు రూ.423.17 కోట్లు మంజూరయ్యాయి. నేటికీ పనులు మాత్రం ప్రారంభించడం లేదు. ఈ పనులు పట్టాలెక్కేందుకు మరో నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. భూసేకరణ, ట్రెంచ్ కొట్టడం, రోడ్డు వేయడానికి మరో రెండేండ్లు పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో రోడ్డుకు రిపేర్లు చేయాలని ప్రయాణికులు ప్రశ్నిస్తే.. విస్తరణ పేరు చెప్పి ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు తప్పించుకుంటున్నారు.
తీవ్ర నిర్లక్ష్యం
జనగామ– సిద్దిపేట రోడ్డు దుస్థితికి గతంలో పనిచేసిన నేషనల్హైవే ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణమనే ఆరోపణలున్నాయి. ఆర్అండ్బీ పరిధిలోని ఈ రోడ్డును నేషనల్ హైవేగా మారుస్తూ 2016లో గెజిట్ విడుదల కాగా 2019 వరకు అప్పటి ఆఫీసర్లు పట్టించుకోలేదు. అటు అర్అండ్బీ ఇటు నేషనల్ హైవే ఆఫీసర్లు దీనిని వదిలేశారు. ఫలితంగా కనీస మెయింటనెన్స్లేక హైవే అధ్వానంగా మారింది.
చుక్కలు కనిపిస్తున్నయ్
జనగామ జిల్లా కేంద్రం నుంచి దుద్దెడ క్రాస్ వరకు 46 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జనగామ శివారు చంపక్ హిల్స్ మొదలు బచ్చన్నపేట వరకు గుంతలు ఉన్నాయి. బచ్చన్నపేట నుంచి దుద్దెడ క్రాస్ వరకు 29 కిలోమీటర్ల మేర భారీ గుంతలు ఏర్పడ్డాయి.ఇక్కడ వాహనాలు సైకిల్ కంటే నెమ్మదిగా వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇదే హైవే రోడ్డులో సిద్దుల గుట్ట, కొమురవెళ్లి వంటి ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. రైస్ మిల్లులు కూడా ఎక్కువే. దీంతో ప్రయాణీకుల రద్దీతో పాటు ధాన్యం లారీల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వేలాది వాహనాల తాకిడి ఉండే ఈ హైవే అధ్వాన పరిస్థితి పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.
ప్రపోజల్స్ పంపాం..
జనగామ–సిద్ధిపేట హైవే రిపేర్ల కోసం రూ.3.5కోట్లతో ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ పంపించాం. టెండర్లు సైతం పూర్తయి అగ్రిమెంట్ దశలో ఉన్నాయి. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. విస్తరణ పనుల పూర్తి చేయడానికి ఎక్కువ టైం పట్టే చాన్స్ ఉండడంతో తాత్కాలిక రిపేర్లకు చర్యలు తీసుకుంటున్నాం.
- కృష్ణారెడ్డి, డీఈఈ, నేషనల్ హైవే
ఇంటింటికీ సంక్షేమ పథకాలు
రాయపర్తి, వెలుగు: కేసీఆర్ హయాంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం, కేశవాపురం గ్రామాల్లో గురువారం పలువురికి కల్యాణలక్ష్మీ చెక్కులు అందజేశారు. ఇటీవల మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో సాగుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, బిల్లా సుధీర్‌రెడ్డి, పూస మధు, లేతాకుల యాదవరెడ్డి, కోదాటి దయాకర్‌రావు ఉన్నారు.
దసరా నాడు రూ.19కోట్ల మద్యం తాగేశారు!
హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో దసరా పండుగ వేళ మద్యం ఏరులై పారింది. పండుగకు ఒకరోజు ముందుగానే మద్యం షాపులకు భారీగా లిక్కర్ బాటిళ్లు, బీర్లు తరలించారు. హనుమకొండలోని రెండు డిపోల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 263 మద్యం షాపులకు మద్యం బాటిళ్లు వెళ్లాయి. దసరా ఒక్క రోజునే దాదాపు రూ.19కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇక సెప్టెంబర్ 29 నుంచి ఆగస్టు నాలుగో తేదీ వరకు లెక్కేస్తే రూ.110 కోట్ల మద్యం తాగినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు.