హనుమకొండ జిల్లా : తెలంగాణ ఉద్యమకారులపై రైల్లో దాక్కొని కాల్పులు జరిపిన చరిత్ర నీది కాదాని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని దాస్యం వినయ్ భాస్కర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనుల ముందు.. కొబ్బరికాయలు కొడుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫొటోలు దిగుతున్నాడని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు. నయీంనగర్ బ్రిడ్జిపై హన్మకొండ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. హనుమకొండలో వరదలు వస్తే కేసీఆర్ 250 కోట్ల నిధులు విడుదల చేశారని ఆయన అన్నారు.
నాలా రిటైనింగ్ వాల్, సమ్మయ్య నగర్ బ్రిడ్జి నిర్మాణాలు పనులు పూర్తి చేశాము. నయీమ్ నగర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినది వినయ్ భాస్కర్ గుర్తుచేశారు. అడ్డమారి గుడ్డిలో గెలిచి నా దమ్ము గురించి మాట్లాడుతున్నావ్ ఏంటి అని ఎమ్మెల్యే రాజేందర్ ను ప్రశ్నించారు. 19 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ హద్దు మీరలేదని దాస్యం వినయ్ భాస్కర్ చెప్పారు. నా దమ్ము ఏంటో తెలంగాణ ఉద్యమం సమయంలో చూశారని మండిపడ్డారు.
దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘సమైక్యవాదులకు వత్తాసు పలికితే.. మానుకోట బిడ్డలు నీపై దాడి చేశారు. రైల్లో దాక్కొని తుపాకీతో ఉద్యమకారులను కాల్చిన చరిత్ర నీది. 420 హామీలు తీర్చలేక రోజుకో డ్రామాలు చేస్తున్నారు. టైం ఇద్దామనుకున్న నాపై పదేపదే దుష్ప్రచారం చేస్తున్నావు. నీవు ఎక్కడికి వెళ్లి ఏం చేస్తున్నావో బయట పెట్టమంటావా అని హెచ్చరించారు. అక్రమంగా దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి విదేశాలకు వెళ్లేది నువ్వు.. పేదల గుడిసెలు తొలగించి దందా చేస్తున్నది నువ్వు.. నీ చరిత్ర ఏందో బయట పెట్టే పరిస్థితులు వచ్చాయి. నీకు దమ్ముంటే కాజీపేట నుంచి పెద్దమ్మగడ్డ వరకు ఉన్న సమస్యలు పరిష్కరించు. పేదల జోలికొస్తే ఖబర్దార్ రాజేందర్ రెడ్డి.. ఇకనైనా పద్ధతి మార్చుకో రాజేందర్ రెడ్డి’’ అని మాజీ MLA వినయ్ భాస్కర్ హెచ్చరించారు.