- బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్
ఖైరతాబాద్, వెలుగు: ఒకప్పుడు సీఎం నివాసమున్న దత్తనగర్లో సమస్యలు తిష్టవేశాయని, వాటి పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ కోరారు. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్తీబాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన 91వ డివిజన్ పరిధిలోని దత్త నగర్ లో పర్యటించారు. మూసీ నాలా నుంచి బస్తీలోకి మురుగునీరు ప్రవహిస్తోందని, చేతిపంపుల్లో నీళ్లు రావట్లేదని, అర్హులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందడం లేదని ప్రజలు తమ దృష్టికి తెచ్చారని చెప్పారు. ఒకప్పుడు సీఎం నివసించిన దత్త నగర్ పై అధికారులు నిర్లక్ష్యం చూపడం తగదన్నారు. ఆయన వెంట బీసీ రాజ్యాధికార సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు పద్మావతి ఉన్నారు.