ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు

నిర్మల్/నస్పూర్/కాగజ్ నగర్/ దండేపల్లి, వెలుగు: దత్తాత్రేయ జయంతి వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. నిర్మల్ లోని గండి రామన్న దత్త సాయిబాబా ఆలయంలో జరిగిన పారాయణం, అభిషేకం, హారతి కార్యక్రమాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావు, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి, బురాజి తదితరులు పాల్గొని పూజలు చేశారు. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ అర్కే8 కాలనీలోని శ్రీ గణపతి శిరిడి సాయిబాబా దేవాలయంలో 108 కలశాలతో బాబాకు క్షీరాభిషేకం, లక్ష పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు.

వేడుకలకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, సురేఖ దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దండేపల్లి మండలం గూడెం శ్రీ దత్తసాయి శ్రీషిరిడీ సాయిబాబా ఆలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకుడు శ్రీమాన్ చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో ఆలయంలో మహా గణపతి పూజ, దత్తత్రేయస్వా మికి ప్రత్యేక పూజలతో పాటు 108 కలశాలతో ఆపోత్తర కలశపూజలు, పంచాభిషేక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులు స్వామి వారి పల్లకిసేవతో ఊరేగింపు నిర్వహించారు. 

వైభవంగా పల్లకీ ఊరేగింపు

సిర్పూర్ టి మండల కేంద్రంలో  ఆదివారం  సాయి నాథుని పల్లకీ ఊరేగింపు వైభవంగా కొనసాగింది.శ్రీ సాయిబాబా టెంపుల్ నుంచి పల్లకి ఊరేగింపు సాగింది. వీధుల గుండా తిరిగి సాయిబాబా టెంపుల్​కు చేరుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయి నామస్మరణ చేశారు.