- భూమి తిరిగి ఇవ్వాలన్నందుకు ఆగ్రహం
- దాడిలో దంపతులకు తీవ్ర గాయాలు
- సూర్యాపేట జిల్లాలో ఘటన
హుజూర్ నగర్, వెలుగు: ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులపైనే కూతురు గొడ్డలితో దాడి చేసింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో ఆదివారం జరిగింది. బూరుగడ్డ గ్రామానికి చెందిన చిరుమామిళ్ల పుల్లారావు, పద్మ దంపతులకు ముగ్గురు బిడ్డలు. అందరికీ చెరో ఎకరం కట్నం కింద ఇచ్చారు.
చిన్న కూతురు పావనిని అదే గ్రామానికి చెందిన ఈడుపుగంటి రవికి ఇచ్చి పెండ్లి చేశారు. కట్నంగా ఇచ్చిన భూమిని కొలిస్తే 18 గుంటలు ఎక్కువ వచ్చింది. దీంతో 18 గుంటల భూమి తిరిగి ఇవ్వాలని పుల్లారావు దంపతులు తన బిడ్డ, అల్లుడిని అడిగారు. ఆ భూమి ఇస్తే సాగు చేసుకుంటూ బతుకుతామని వేడుకున్నారు. దీనికి బిడ్డ, అల్లుడు ఒప్పుకోలేదు. ఆదివారం పొలం దున్నేందుకు పావని, రవి, వీళ్ల కొడుకు మోహన్ వెళ్లారు. విషయం తెలుసుకున్న పుల్లారావు దంపతులు కూడా అక్కడికి చేరుకున్నారు. 18 గుంటల భూమి వదిలి దున్నుకోవాలని సూచించారు. దీంతో గొడవ మొదలైంది. పావని, రవి, మోహన్ కలిసి పుల్లారావు దంపతులపై కర్రలతో దాడి చేశారు.