
రాను రాను.. మనుషుల్లో రాక్షసత్వం,పైశాచికత్వం పెరిగిపోతోంది. ముఖ్యంగా నేటి యువతలో మానవసంబంధాల పట్ల కనీస గౌరవం కూడా లేకుండా పోతున్నాయి. తమ మాట కాదంటే ఎంతటికైనా తెగిస్తున్నారు చాలామంది యువత. అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఇందుకు నిదర్శనం.. ప్రేమించొద్దు అన్నందుకు తండ్రిని అతికిరాతకంగా చంపేసింది ఓ కూతురు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..
అంబెడ్కర్ కోనసీమ జిల్లాలోని మండపేటలో సూరా రాంబాబు అనే వ్యక్తి, తన కూతురు వస్త్రాల దుర్గ నివాసం ఉంటున్నారు.ఆమె రామచంద్రపురం కొత్తూరుకు చెందిన ముమ్మిడివరపు సురేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన తండ్రి రాంబాబు కుమార్తెను దుర్గను మందలించాడు. అయితే తండ్రి తన క్షేమం కోసమే చెబుతున్నాడని విచక్షణ మరిచి తండ్రిపైనే కక్ష్య పెట్టుకుంది దుర్గ.
ప్రియుడితో కలిసి తండ్రిని చంపడానికి పథకం పన్నింది దుర్గ. మార్చి16న తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ప్రియుడు సురేష్‌కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది దుర్గ. సురేష్ తనతోపాటు స్నేహితుడు తాటికొండ నాగార్జునను తీసుకొచ్చాడు... ముగ్గురూ కలిసి నిద్రిస్తున్న రాంబాబు ఛాతిపై కూర్చొని పీక పిసికి చంపేశారు.
ఆ తర్వాత ఏమీ తెలియనట్టు తండ్రి నిద్రలోనే చనిపోయినట్లు నాటకం ఆడింది దుర్గ. అయితే మృతుడి సోదరుడు సూరా పండు.. రాంబాబు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గుర్తించి... దుర్గపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పండు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు. నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అనంతరం రామచంద్రపురం కోర్టుకు తరలించగా.. నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.