చేవెళ్ల, వెలుగు: అనారోగ్యంతో కన్న తండ్రి చనిపోయిన కొద్దిసేపటికే కూతురు హార్ట్ ఎటాక్‌తో మరణించింది. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం న్యాలట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కావలి మానయ్య(65)కు నలుగురు కూతుళ్లు. పెద్ద కుమార్తె బాలామణి(40)ని పెండ్లయిన కొన్నాళ్లకే ఆమె భర్త విడిచిపెట్టడంతో పుట్టింటికి వచ్చింది.
వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఇంటికి పెద్ద దిక్కుగా మారింది. వృద్ధులైన తల్లిదండ్రులకు సేవలు చేసింది. అనారోగ్యంతో మంచాన పడిన తండ్రికి అన్నీ తానై చూసుకుంది. ముగ్గురు చెల్లెళ్లకు పెండ్లిళ్లు కూడా చేసింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అనారోగ్యంతో తండ్రి మానయ్య చనిపోయాడు.
తండ్రి మరణాన్ని బాలామణి తట్టుకోలేకపోయింది. మానయ్య మృతదేహం వద్దే ఏడుస్తూ హార్ట్‌ఎటాక్‌తో కుప్పకూలిపోయింది. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.