కోడలు సూసైడ్‍ కేసులో.. రాజయ్య కుటుంబానికి క్లీన్‍చిట్

  • 2015లో ముగ్గురు పిల్లలతో కలిసి సారిక ఆత్మహత్య
  • ఘటనలో రాజయ్యతో పాటు నలుగురిపై కేసు నమోదు

వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్‍ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు పిల్లల ఆత్మహత్య కేసులో రాజయ్య కుటుంబానికి ఊరట లభించింది. ప్రధాన నిందితులుగా ఉన్న సారిక భర్త అనిల్‍, మామ రాజయ్య, అత్త మాధవీలతలను నాంపల్లి కోర్టు మంగళవారం నిర్దోషులుగా ప్రకటించింది.
లవ్‍ మ్యారేజ్‍.. ముగ్గురు పిల్లలు
సిరిసిల్ల రాజయ్య కుమారుడు అనిల్‍, సారిక ఇంజనీరింగ్‍ చదివేటప్పుడు ప్రేమించుకున్నారు. 2002లో యాదగిరిగుట్టలో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. 2010లో సనా అనే మహిళతో అనిల్‍ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడనే సమాచారంతో సారిక ఆత్మహత్యాయత్నం చేసింది. సనా విషయమై రాజయ్య కుటుంబంలో పలుమార్లు గొడవలు జరిగాయి. 2014 ఏప్రిల్‍లో అనిల్‍తోపాటు అత్తమామలు కట్నకానుకలు తేవాలంటూ వేధిస్తున్నారని.. తనను, పిల్లల పోషణను పట్టించుకోవడంలేదని సారిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వరకట్నం కేసులో రాజయ్య దంపతులు, అనిల్‍ను పోలీసులు అరెస్ట్ చేయగా.. వారు బెయిల్‍పై బయటకొచ్చారు. 2015 జనవరిలో జీవనభృతి కింద సారికకు నెలకు రూ.6 వేలు, ముగ్గురు పిల్లలకు రూ.3 వేల చొప్పున మొత్తం నెలకు రూ.15 వేలు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
2015లో తల్లీపిల్లల ఆత్మహత్య
అనిల్‍తోపాటు రాజయ్య, మాధవి తనను, పిల్లలను పట్టించుకోకపోవడంతో సారిక ఇంట్లో ఒంటరిదైంది. దీనికితోడు కోర్ట్ తీర్పు ప్రకారం జీవనభృతి సకాలంలో ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడింది. జీవనభృతి చెల్లించకుండా వేధిస్తున్నాడనే కేసు విషయమై 2015 నవంబర్‍ 2న అనిల్‍, సారిక కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆస్తిపాస్తుల అంశమై ఇంట్లో వీరిద్దరి మధ్యా గొడవలు జరిగాయి. చివరికి 2015 నవంబర్‍ 4న సారికతో పాటు పెద్ద కుమారుడు అభినవ్‍ (7) కవల పిల్లలైన అయోన్‍, శ్రీయోన్‍ (3) గ్యాస్‍ లీకేజీ మంటలకు ఆహుతయ్యారు. కాగా, వారిది హత్య కాదని.. గ్యాస్ లీక్ అవడం వల్లే ప్రమాదం జరిగిందని హైదరాబాద్‌‌లోని ఫోరెన్సిక్‌‌ సైన్స్‌‌ ల్యాబొరేటరీ  అప్పట్లోనే నివేదిక సమర్పించింది.
చిత్రహింసలు పెడ్తున్నారని లేఖ..
సారిక ఆత్మహత్య సమయంలో తన అడ్వొకేట్‍కు 22 పేజీల లెటర్ మెయిల్‍ చేసింది. తన మామ ఎంపీ అయ్యాక వేధింపులు పెరిగాయని, అనిల్‍ మరో మహిళతో గడుపుతూ తమను పట్టించుకోవట్లేదని.. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని అందులో ఆరోపించింది. దీంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు అనిల్‍, రాజయ్య, మాధవీలత, సనాలను అరెస్ట్​ చేశారు. 2016 ఫిబ్రవరిలో వరంగల్‍ కోర్ట్ రాజయ్య కుటుంబానికి షరతులతో బెయిల్‍ మంజూరు చేసింది. సనాకు మాత్రం బెయిల్​ ఇవ్వలేదు. ఆరున్నరేండ్ల తర్వాత ముగ్గురికీ నాంపల్లి కోర్ట్ క్లీన్‍ చిట్‍ ఇచ్చింది.