- ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మృతి
కారేపల్లి, వెలుగు : తరచూ మందలిస్తున్నాడన్న కోపంతో ఓ మహిళ తన మామపై వేడి వేడి నూనె పోసింది. తీవ్రంగా గాయపడ్డ అతడు ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఫైల్‌తండాలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన అజ్మీరా బాబు (60) కొడుకు కరోనా టైంలో చనిపోయాడు.
అప్పటి నుంచి అతడి భార్య ఉమ ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో ఆమె తీరు మార్చుకోవాలని బాబు పలుమార్లు కోడలు ఉమను హెచ్చరించాడు. మామపై కోపం పెంచుకున్న ఉమ గత నెల 28న ఇంట్లో మంచంపై పడుకున్న బాబుపై వేడి వేడి నూనె పోసింది. తీవ్రంగా గాయపడడంతో చుట్టుపక్కల వారు గమనించి బాబును వరంగల్ ఎంజీఎం తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ బుధవారం చనిపోయాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో ఉమపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజారాం తెలిపారు.