సంతకం ఫోర్జరీ చేసి..అత్త డబ్బులు కొట్టేసిన కోడలు

  • ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్‌‌‌‌‌‌‌‌ అకౌంట్‌‌‌‌‌‌‌‌ నుంచి  రూ.5.20 లక్షలు ట్రాన్స్ ఫర్ 

ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు :  అత్త సంతకం  ఫోర్జరీ  చేసి బ్యాంకులోని ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్‌‌‌‌‌‌‌‌ డబ్బులను కోడలు కొట్టేసింది. వివరాల్లోకి వెళ్తే... ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా జైనథ్‌‌‌‌‌‌‌‌ మండలం ఆనంద్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన తిప్పారెడ్డి రేఖ ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌ టౌన్ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ చౌక్‌‌‌‌‌‌‌‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో గతంలో రూ. 5.13 లక్షలను ఫిక్స్‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్‌‌‌‌‌‌‌‌ చేసింది. డబ్బులను తీసుకునేందుకు డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 11న బ్యాంక్‌‌‌‌‌‌‌‌కు వెళ్లగా.. తన అకౌంట్‌‌‌‌‌‌‌‌లో ఉండాల్సిన రూ.5.20 లక్షలు తన కోడలు సంధ్యారాణి అకౌంట్‌‌‌‌‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ అయ్యాయని ఆఫీసర్లు చెప్పారు.

దీంతో గత నెల 16న టూ టౌన్‌‌‌‌‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంధ్యారాణి తండ్రి విలాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి అదే బ్యాంక్‌‌‌‌‌‌‌‌లో పని చేసి రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ కావడంతో, ఫోర్జరీ సంతకం చేసి డబ్బులను ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారని బాధితురాలు రేఖ ఆరోపించింది. తనకు తెలియకుండా డబ్బులు తీసుకున్న తన కోడలు సంధ్యారాణితో పాటు, ఆమె తండ్రి, సహకరించిన బ్యాంక్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని బుధవారం రీజినల్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌కు ఫిర్యాదు అందజేసింది. విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌‌‌‌‌‌‌‌  రీజినల్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ దాముక ప్రభుదాస్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.