ఓహియోలోని గిరార్డ్లో ‘పాస్ట్ టైమ్స్ ఆర్కేడ్’ అనే బిల్డింగ్ ఉంది. దాని యజమాని రాబ్ బెర్క్. ఆయన కూతురి పేరు రెయిల్లీ బెర్క్. ఆ బిల్డింగ్‌లో పాతకాలం నాటి పిన్ బాల్ మెషిన్స్ చాలా ఉన్నాయి. వాటిని రాబ్ బెర్క్ఎంతో ప్రేమతో భద్రపరిచాడు. అవి చూసిన రాబ్ బెర్క్ కూతురికి ‘‘నాన్న సేకరించిన మెషిన్స్ చాలా ఉన్నాయి. దీంతో రికార్డ్ కొట్టొచ్చు’’ అని అనిపించింది. రెండేండ్ల కాలంగా ఆయన వాటిని కలెక్ట్ చేస్తున్నాడు. రికార్డ్ కొట్టాలంటే వెయ్యికి పైగా ఉండాలి. ఎందుకంటే అంతకుముందు రికార్డ్ వెయ్యి మెషిన్స్తో ఉంది.
ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాబ్ బెర్క్ దగ్గర 1041 మెషిన్లు ఉన్నాయి. దాంతో రెయిల్లీకి రికార్డ్ కొట్టగలమనే నమ్మకం వచ్చింది. ప్రతి మెషిన్ని ఫొటో, వీడియో తీసి, నెంబర్లు వేశారు. వాటిలో డూప్లికేట్ వాటిని పక్కనపెట్టి ఒరిజినల్ వాటిని లెక్కపెట్టారు. ఈ పనిలో ఆర్కేడ్‌లో పనిచేసే ఉద్యోగులు కూడా రెయిల్లీకి సాయం చేశారు. అయితే, ఈ రికార్డ్‌ని తన తండ్రి 70వ పుట్టినరోజుకి బహుమతిగా ఇవ్వాలనుకుంది.
కానీ, ఆ రోజున వీలుపడలేదు. సరిగ్గా ఆయన పుట్టినరోజు అయిపోయిన మూడు రోజుల తర్వాత రికార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు మెయిల్ వచ్చింది. దాంతో రెయిల్లీ ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ప్రపంచంలోనే అతి పెద్ద పిన్ బాల్ కలెక్షన్ రాబ్బెర్క్ దగ్గర ఉందని గిన్నిస్ బుక్ రికార్డ్ వాళ్లు ప్రకటించారు. కానీ ఆ విషయం రాబ్ బెర్క్కి తెలియదు. ఆ రికార్డ్‌ని గిఫ్ట్ ప్యాక్ చేయించిన కూతురు తండ్రితో ఓపెన్ చేయించడంతో ఆయన కళ్లు ఆనందబాష్పాలతో నిండిపోయాయి.