- పెద్ద మనుషుల జోక్యంతో అంత్యక్రియలు పూర్తి
కోదాడ, వెలుగు : సమాజంలో రోజురోజుకూ మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. ఆస్తి కోసం తల్లిదండ్రులు మరణిస్తే అంత్యక్రియలు చేయకుండా గొడవలు పడుతున్న ఉదంతాలు చూస్తున్నాం. ఇలాంటి ఘటన గురువారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కోదాడ పట్టణంలో నివాసం ఉండే వెలిదినేని లక్ష్మి భర్త పదేండ్ల కింద చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తోంది. వారికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ వివాహం అయింది. లక్ష్మి పేరిట కోదాడలో ఒక ఇల్లు ఉంది. ఆమె తన ఇంటిని నాలుగు వాటాలుగా చేసి మూడు వాటాలను తన కూతుర్లకు ఇవ్వగా, మిగిలిన భాగాన్ని తన పేరిట ఉంచుకుంది.
కొంతకాలం లక్ష్మి తన చిన్న కూతురు దగ్గర ఉండడంతో నాలుగో భాగం ఆమెకు ఇస్తుందేమోనని మిగతా ఇద్దరు కూతుర్లు గొడవకు దిగారు. ఈ వివాదం ఇలా నడుస్తుండగా బుధవారం రాత్రి లక్ష్మి(85) మృతి చెందింది. తల్లిని కాటికి సాగనం పాల్సిన కూతుర్లు ఆమె శవాన్ని రోడ్డుపైనే ఉంచి నాలుగో వాటా కోసం గొడవకు దిగారు. ఆస్తి కోసం కన్న తల్లి శవాన్ని రోడ్డుపై ఉంచడంతో వారి బంధువులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినకపోవడంతో పెద్ద మనుషులు జోక్యం చేసుకొని కూతుళ్లకు సర్దిచెప్పారు. దీంతో తల్లి మృతదేహానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు.