బంజారాహిల్స్ లోని డీఏవీ పాఠశాల అనుమతిని విద్యాశాఖ పునరుద్ధరించింది. కేవలం ఈ విద్యా సంవత్సరానికి మాత్రమే తాత్కాలిక అనుమతి ఇస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పాఠశాలలో చిన్నారిపై లైంగిక దాడి ఘటన చోటు చేసుకోవడంతో గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో స్కూల్ గుర్తింపును విద్యాశాఖ రద్దు చేసింది. అయితే ఇందులో చదువుతున్న విద్యార్ధుల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలను పున: ప్రారంభించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
దీంతో ఈ విద్యా సంవత్సరానికి డీఏవీ పాఠశాలను కొనసాగించవచ్చని అనుమతి ఇచ్చారు. విద్యాశాఖ సూచించిన నిబంధనలు పక్కాగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చిన్నారిపై లైంగిక దాడి ఘటన ప్రకంపనలు సృష్టించింది. దీంతో బీఎస్డీ డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును సర్కారు రద్దు చేసింది. ఆ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్లు విద్యా సంవత్సరం నష్టపోకుండా పక్కనే ఉన్న స్కూళ్లలో వారిని సర్దుబాటు చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డీఈవోను ఆదేశించారు. ఈకేసులో డ్రైవర్ రజినికుమార్, ప్రిన్సిపాల్ మాధవిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.