Virat Kohli: కోహ్లీ కెరీర్ ముగింపుకు చేరుకుంది.. మరో సచిన్, ద్రవిడ్‌ను వెతకండి: ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఫార్మాట్ ఏదైనా కోహ్లీ విఫలమవుతున్నాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో విరాట్ ఫామ్ ఘోరంగా ఉంది. చివరి నాలుగేళ్లలో టెస్టుల్లో 30 యావరేజ్ కంటే తక్కువగా పరుగులు చేశాడు. అయినప్పటికీ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్ ను పక్కన పెట్టె సాహసం ఎవరూ చేయలేదు. టెస్టుల్లో కోహ్లీ యావరేజ్ 54 నుంచి 46 కి పడిపోయింది. జట్టును ఆదుకోవాల్సిన కోహ్లీ పరుగులు చేయలేక టీమిండియాకు భారంగా మారుతున్నాడు. 

కోహ్లీ ఫామ్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ లిస్ట్ లో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ కోహ్లీ ఫామ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ కెరీర్ ముగిసిపోయిందని ఆయన జోస్యం చెప్పాడు. " విరాట్ కోహ్లీ తన ఫామ్ ను పూర్తిగా కోల్పోయాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అతని ఆట చూస్తే అర్ధమవుతుంది. ఆఫ్-స్టంప్ వెలుపల పడిన బంతులను ఆడడంలో విఫలమవుతూ స్లిప్ లో క్యాచ్ ఇచ్చాడు. కోహ్లీ అనుకున్న సమయం కంటే క్రికెట్ లో కొంత ఎక్కువ సమయం ఆడాడు.  

ALSO READ | Jasprit Bumrah: బుమ్రాను వరించిన ఐసీసీ అవార్డు.. స్మృతి మంధానకు నిరాశ

కోహ్లీకి కాలం చెల్లిపోయింది. వయసుతో పాటు ఇలా జరగడం సహజం. సెలెక్టర్లు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అతను మనం చూసిన గొప్ప ఆటగాళ్ళలో ఒకడు. భారత సెలెక్టర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ లాంటి లాంటి ఆటగాళ్లను తయారు చేయాలి". అని లియోడ్ టాక్‌స్పోర్ట్ క్రికెట్‌తో అన్నారు. టెస్ట్ క్రికెట్ లో సచిన్ నాలుగో స్థానంలో ఆడేవాడు. టెండూల్కర్ రిటైర్మెంట్ అనంతరం కోహ్లీ నాలుగో స్థానంలో ఆడుతూ వస్తున్నాడు.   

ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ 9 ఇన్నింగ్స్ ల్లో కేవలం 190 పరుగులు మాత్రమే చేయడంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో 12 ఏళ్ళ తర్వాత టాప్ 25 లో చోటు కోల్పోయాడు. కోహ్లీ ఫామ్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఘోరంగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. విరాట్ తన పేలవ ఫామ్ ను కొనసాగిస్తే అతని టెస్ట్ క్రికెట్ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం కనిపిస్తుంది. 

2025 డబ్ల్యూటీసీ టెస్ట్ సిరీస్ ను భారత్ జూన్ నెల నుంచి ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఇంగ్లాండ్ గడ్దపై భారత్ 5 టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ కోహ్లీ టెస్ట్ కెరీర్ కు కీలకం కానుంది. ఒకవేళ కోహ్లీ ఇంగ్లాండ్ సిరీస్ లో విఫలమైతే అతని టెస్ట్ కెరీర్ ముగిసినట్టే అని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. ఈ కఠిన సవాలుకు ముందు కోహ్లీ ఇంగ్లాండ్ కౌంటీల్లో కనబడే అవకాశం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి హెడ్డింగ్లీలోని లీడ్స్‌లో ప్రారంభమవుతుంది.