PAK vs SA 1st T20: మిల్లర్ భారీ సిక్సర్.. కొడితే స్టేడియం దాటి రోడ్డుపై పడిన బంతి

సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ టీ20 క్రికెట్ లో ఇప్పటికీ ప్రమాదమే. దశాబ్దకాలంగా టీ20 క్రికెట్ లో ఇప్పటికీ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. అదే ఫామ్ కొనసాగిస్తూ దూసుకెళ్తున్నాడు. భారీ ఇన్నింగ్స్ లు ఆడడం.. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడడం మిల్లర్ కు వెన్నతో పెట్టిన విద్య. పాకిస్థాన్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో మరోసారి విశ్వ రూపం చూపించాడు. 40 బంతుల్లోనే 82 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మిల్లర్ ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉండడం విశేషం. 

మిల్లర్ ఆడిన ఇన్నింగ్స్ లో ఒక సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. ఇన్నింగ్స్ 10 వ ఓవర్ ఐదో బంతికి భారీ సిక్సర్ కొట్టాడు. అబ్రార్ అహ్మద్ బౌలింగ్ లో కొట్టిన ఈ భారీ సిక్సర్ స్టేడియం రూఫ్ దాటి రోడ్డుపై పడింది. ఈ ఓవర్ లో మిల్లర్ కు ఇది వరుసగా మూడో సిక్సర్ కావడం విశేషం. మిల్లర్ తో పాటు జార్జ్ లిండే ఆల్ రౌండ్ షో తో తొలి టీ20లో సౌతాఫ్రికా 11 పరుగుల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. 

Also Read:-మ్యాక్స్‌వెల్‌ ఔట్.. కెప్టెన్‌గా స్టోయినిస్..

మొదటి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. మిల్లర్ 40 బంతుల్లో 82 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో లిండే 48 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులకే పరిమితమైంది. మహ్మద్ రిజ్వాన్ చివరి వరకు క్రీజ్ లో ఉన్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. డిసెంబర్ 13 న ఇరు జట్ల మధ్య రెండో టీ20 జరుగుతుంది.