
సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ ఫైనల్లో మెరుపు సెంచరీతో దుమ్ములేపాడు. లాహోర్ వేదికగా బుధవారం (మార్చి 5) న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 67 బంతుల్లోనే సెంచరీ చేసి ఈ టోర్నమెంట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మిల్లర్ కు మరొక బ్యాటర్ సహకరించి ఉంటే ఫలితం వేరుగా ఉండేది. ఒక్కడే చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ మ్యాచ్ ఓటమితో సౌతాఫ్రికా ఎప్పటిలాగే తీవ్ర నిరాశలో కనిపించింది. సెమీ ఫైనల్లో మరోసారి ఓడిపోయి టైటిల్ ఆశలు చేజార్చుకుంది.
మ్యాచ్ తర్వాత మాట్లాడిన మిల్లర్ భారత క్రికెట్ ప్రేమికులను నిరాశపరిచాడు. నిజం చెప్పాలంటే ఫైనల్లో నేను న్యూజిలాండ్ జట్టుకు సపోర్ట్ చేస్తానని చెప్పాడు. మిల్లర్ స్టేట్ మెంట్ తో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ షాక్ లోకి వెళ్లారు. సౌతాఫ్రికాకు ఐసీసీ టైటిల్స్ రావాలని ఇండియా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయినప్పుడు కూడా సఫారీలపై సింపతీ చూపించారు. కానీ మిల్లర్ మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ కు సపోర్ట్స్ చేస్తానని బహిరంగంగానే తెలిపాడు.నెటిజన్స్ మిల్లర్ మాటలకు ఆశ్చర్యపోతూ ఏంటో బ్రో అంత మాటన్నావు. అని కామెంట్ చేస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా ఐదు పాయింట్లతో గ్రూప్ బి టాపర్ గా సెమీస్ లోకి అడుగుపెట్టింది. లీగ్ దశలో ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఓడిపోయింది. మంగళవారం (మార్చి 4) జరిగిన తొలి సెమీ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఈ రెండు జట్లు దుబాయ్ వేదికగా ఆదివారం (మార్చి 9) జరగబోయే ఫైనల్లో ఇండియా, న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.