T20 World Cup 2024: నాటౌటైనా పెవిలియన్ బాట పట్టిన మిల్లర్.. అసలేం జరిగిందంటే..?

T20 World Cup 2024: నాటౌటైనా పెవిలియన్ బాట పట్టిన మిల్లర్.. అసలేం జరిగిందంటే..?

టీ20 వరల్డ్ కప్ లో వింత సంఘటన చోటు చేసుకుంది. శనివారం (జూన్ 15) దక్షిణాఫ్రికా, నేపాల్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సఫారీ ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఔట్ కాకుండానే పెవిలియన్ బాట పట్టాడు. సాధారణంగా అంపైర్ ఔట్ ఇస్తేనే పెవిలియన్ వెళ్ళడానికి ఇష్టపడని ఆటగాళ్లను చూశాం. కానీ మిల్లర్ మాత్రం తనను తాను ఔట్ గా భావించుకొని మైదానాన్ని వీడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. అసలు ఇంతకు ఏమైందో ఇప్పుడు చూద్దాం.         

కింగ్స్ స్టన్ వేదికగా శనివారం (జూన్ 15) నేపాల్ పై జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. క్లాసన్ ఔట్ కావడంతో ఇన్నింగ్స్ 14 ఓవర్లో మిల్లర్ బ్యాటింగ్ కు వచ్చాడు. కుశాల్ భుర్టెల్ వేసిన ఈ ఓవర్లో ఆడిన రెండో బంతికే స్వీప్ షాట్ కు ప్రయత్నించాడు. అయితే అది మిస్ కావడంతో మిల్లర్ ప్యాడ్లకు తగిలింది. నేపాల్ ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ నాటౌట్ అని వారి అప్పీల్ ను తిరస్కరించాడు. దీంతో కెప్టెన్ రోహిత్ పాడెల్ రివ్యూకు వెళ్ళాడు.

స్క్రీన్ పై స్లో మోషన్ లో రివ్యూ చూపిస్తున్నప్పుడూ మిల్లర్ తనను తాను ఔటనుకొని పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. అయితే బంతి లైన్ లో పడినా వికెట్లను మిస్ అయింది. దీంతో అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. అప్పటికే దాదాపు గ్రౌండ్ సగానికి వెళ్లిన మిల్లర్ అంపైర్ నాటౌట్  ఇవ్వడంతో మళ్ళీ బ్యాటింగ్ చెయ్యడానికి వచ్చాడు. మళ్ళీ బ్యాటింగ్ చేయడానికి తిరిగొచ్చిన మిల్లర్ విఫలమయ్యాడు. 10 బంతుల్లో 7 పరుగులే చేసి ఔటయ్యాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.  ఓపెనర్   రీజా హెండ్రిక్స్ 43, డీకాక్ 10, మార్కరమ్ 15,ట్రిస్టాన్ స్ట్రబ్స్ 27 పరుగులు చేశారు. 116 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నేపాల్ ఒకానొక దశలో గెలిచేలా కనిపించింది. చివరి ఓవర్‌లో 8 రన్స్ చేయాల్సి ఉండగా ఆరు పరుగులే చేసింది.చివరి బంతికి గుల్సన్ జా రనౌట్ కావడంతో 114/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్ ముగిసింది.