ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఘోర తప్పిదం చేశాడు. ఔటయ్యాననే బాధలో ఎటు వెళ్తున్నాననే సంగతే మరిచిపోయాడు. పొరపాటున ప్రత్యర్థి జట్టు డ్రెస్సింగ్ రూమ్ వైపు దారి మళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఐసీసీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. 'ప్రపంచవ్యాప్తంగా వార్నర్ ఎంతో క్రికెట్ ఆడాడు. ఆ కారణంతో ఈ ఒకసారి అతన్ని క్షమించి వదిలేద్దాం.. ' అని రాసుకొచ్చింది.
అసలేం జరిగిందంటే..?
బార్బడోస్ వేదికగా గురువారం(జూన్ 06) ఒమన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ (67 నాటౌట్), డేవిడ్ వార్నర్ (56) హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే, ఇన్నింగ్స్ ఆఖర్లో వార్నర్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. నిరాశతో పెవిలియన్ బాట పట్టిన వార్నర్.. ఎటు పోతున్నాననే సంగతే మరిచిపోయాడు. ఆసీస్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్ళాల్సింది పోయి ఒమన్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ దిశగా అడుగులు వేశాడు. చివరకు మెట్లు కూడా ఎక్కాడు. ఇంతలో తేరుకొని తిరిగి ఆసీస్ రూమ్‌కు వెళ్లాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
50 పరుగులకే 3 వికెట్లు
కాగా, ఈ మ్యాచ్‌లో 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును వార్నర్.. స్టోయినిస్(67 నాటౌట్)తో గట్టెక్కించాడు. వీరిద్దరూ ఒమన్ బౌలర్లను ఉతికేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఏకంగా నాలుగో వికెట్‌కు 102 పరుగులు జోడించారు. దీంతో ఆసీస్ 165 పరుగులు చేయగలిగింది. అనంతరం ఛేదనలో ఒమన్ 125కే పరిమితమై 39 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.