ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్, న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మధ్య విడదీయలేని బంధం ఉందేమో అనిపిస్తుంది. వీరిద్దరూ మరోసారి కలిసి ఆడనున్నారు. 2025 పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ తరపున ఈ జోడీ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున వార్నర్, విలియంసన్ సేవలను మర్చిపోలేం. ఈ ద్వయం ఎన్నో సీజన్ లు హైదరాబాద్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ గా, బ్యాటర్ గా ఇద్దరిది అద్భుతమైన ప్రస్తానం. అయితే వీరిద్దరూ పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఒకే జట్టుకు ఆడడం కొస మెరుపు.
2025 పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ప్లాటినం డ్రాఫ్ట్‌లో 44 మంది ఆటగాళ్లలో వార్నర్ కూడా ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత బిగ్ బాష్ లీగ్ ఆడుతూ బిజీగా ఉన్న వార్నర్ త్వరలో జరగబోయే పాక్ లీగ్ లో తొలిసారి కనిపించబోతున్నాడు. న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ప్లాటినం రౌండ్‌లో అమ్ముడుపోలేదు. అయితే అతన్ని డైమండ్ రౌండ్‌లో కరాచీ కింగ్స్ దక్కించుకుంది.
ALSO READ | Champions Trophy 2025: ఆ టోర్నీ ముగిశాకే ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా స్క్వాడ్ ప్రకటన
ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో వార్నర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 54 సగటుతో 324 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్ తరపున ఆడుతున్న వార్నర్.. మూడు అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ లో అమ్ముడుపోని వార్నర్.. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భారీ ధరకు కొనుగోలు చేయడం విశేషం.
ప్రస్తుతం విలియంసన్ సౌతాఫ్రికా టీ20 లీగ్ లో డర్బన్ సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. డర్బన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన తన మొదటి మ్యాచ్‌లో 40 బంతుల్లో 60 పరుగులు చేసి రాణించాడు. ఐపీఎల్ లో విలియంసన్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోగా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో అతనికి ఊరట దక్కింది.