ఏప్రిల్ 24వ తేదీన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో సన్ రైజర్స్ పై డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ సమయంలో ఓ అభిమాని ప్రదర్శించిన పోస్టర్ వైరల్ అయింది.
వార్నర్ పుష్ప..
డేవిడ్ వార్నర్ గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే వేలంలో హైదరాబాద్ జట్టు అతన్ని కొనుగోలు చేయలేదు. దీంతో వార్నర్ ను ఢిల్లీ జట్టు దక్కించుకుంది. తాజా సీజన్ లో ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వార్నర్..సన్ రైజర్స్ తో మ్యాచు ఆడేందుకు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియానికి వచ్చాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రేక్షకులు అతనికి ఘన స్వాగతం పలికారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియం మొత్తం వార్నర్ నినాదాలతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా ఓ అభిమాని వార్నర్ ను పుష్పతో పోల్చాడు. పుష్ప ది రూల్ పోస్టర్ లో వార్నర్ ఫోటోను ఎడిట్ చేసి ప్రదర్శించాడు. ఈ ఫోటో మ్యాచ్ స్క్రీన్ పై కనిపించడంతో మిగతా అభిమానులు మరింత సంతోషం వ్యక్తం చేశారు. ఈ పోస్టర్‌లో “వార్నర్: ది రూల్ ఇన్ హైదరాబాద్” అని రాసి ఉంది,
గెలిచే మ్యాచులో ఓటమి
ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఆ తర్వాత 145 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్..20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేసింది.