- సెంచరీలతో చెలరేగిన వార్నర్, మార్ష్
- 62 రన్స్ తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా
బెంగళూరు : పాకిస్తాన్‌ను చూడగానే రెచ్చిపోయే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (124 బాల్స్‌లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163) వరల్డ్ కప్‌లోనూ చిత్తకొట్టాడు. వన్డే ఫార్మాట్లో ఆ టీమ్‌పై వరుసగా నాలుగో సెంచరీతో రెచ్చిపోయాడు. బర్త్‌డే బాయ్ మిచెల్ మార్ష్ (108 బాల్స్‌లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121) కూడా వందతో చెలరేగడంతో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా పంజా విసిసింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 62 రన్స్ తేడాతో పాక్‌ను ఓడించి రెండో విజయం సొంతం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 367/9 స్కోరు చేసింది. పాక్ బౌలర్లలో షాహీన్ ది ఐదు, హారిస్ రవూఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌లో పాక్ 45.3 ఓవర్లలో 305 రన్స్‌కే ఆలౌటైంది. ఓపెనర్లు ఇమామ్ ఉల్ హక్ (70), అబ్దుల్లా షఫీక్ (64) రాణించారు. జంపా 4 వికెట్లతో దెబ్బకొట్టాడు. వార్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
259 రన్స్ పార్ట్‌నర్‌షిప్
చిన్న గ్రౌండ్‌లో ఫ్లాట్ పిచ్‌పై ఆసీస్ ఓపెనర్లు వార్నర్, మిచెల్ మార్ష్ వీర విధ్వంసం సృష్టించారు. వార్నర్ 10 రన్స్ వద్ద ఇచ్చిన క్యాచ్‌ను ఉసామా డ్రాప్ చేయడం పాక్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఈ లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న డేవిడ్ రవూఫ్ బౌలింగ్‌లో ఫోర్, భారీ సిక్స్‌తో స్పీడ్ పెంచగా.. అదే ఓవర్లో మార్ష్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టడంతో ఏకంగా 24 రన్స్ వచ్చాయి. అటు మార్ష్.. ఇటు వార్నర్ పోటాపోటీగా ఫోర్లు, సిక్సర్ల కొట్టడంతో 30 ఓవర్లలో స్కోరు 200 దాటింది.
తర్వాతి ఓవర్లో వరుస బాల్స్‌లో వార్నర్ (85 బాల్స్), మార్ష్ (100 బాల్స్) సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్లు మరింత రెచ్చిపోయారు. 33వ ఓవర్లో వార్నర్ 4,6, 4, 4తో చెలరేగాడు. షాహీన్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు కొట్టిన మార్ష్ మరో షాట్‌కు ట్రై చేసి ఉసామాకు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 259 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బర్ఏక్ అయింది. తర్వాతి బాల్‌కే మ్యాక్స్‌వెల్ (0)ను షాహీన్ డకౌట్ చేయగా.. స్టీవ్ స్మిత్ (7) నిరాశ పరిచాడు. అయినా వెనక్కుతగ్గని వార్నర్.. ఉసామా బౌలింగ్‌లో సిక్స్‌తో 150 పూర్తి చేసుకోవడంతో పాటు స్కోరు 300 దాటించాడు. డబుల్ సెంచరీ చేసేలా కనిపించిన వార్నర్‌ను 43వ ఓవర్లో హారిస్ ఔట్ చేయడంతో మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. చేతిలో వికెట్లు ఉండటంతో ఆసీస్ 400 స్కోరు చేసేలా కనిపించింది. కానీ, చివరి ఆరు ఓవర్లలో రెండే బౌండ్రీలు ఇచ్చిన పాక్ బౌలర్లు ఆరు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కాస్త అడ్డుకున్నారు..
ఓపెనర్లు మెరిసినా
భారీ టార్గెట్ ఛేజింగ్‌ను పాక్ సైతం మెరుపు వేగంతో ఆరంభించినా.. ఆసీస్ బౌలర్లు పుంజుకొని ఆ టీమ్‌కు ముకుతాడు వేశారు. తొలి 20 ఓవర్లు మాత్రం ఇమామ్, షఫీక్ కంగారూ బౌలర్లను వణికించారు. వరుస బౌండ్రీలతో హోరెత్తించారు. కమిన్స్ బౌలింగ్‌లో షఫీక్ రెండు సిక్సర్లతో మరింత స్పీడు పెంచాడు. ఈ ఇద్దరి ధాటికి 17 ఓవర్లకే స్కోరు వంద దాటడంతో పాక్ మరోసారి రికార్డు టార్గెట్ చేసేలా కనిపించింది. అయితే, 22వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన స్టోయినిస్ మ్యాజిక్ చేశాడు. తన ఫస్ట్ బాల్‌కే షఫీక్‌ను ఔట్ చేసిన అతను తర్వాతి ఓవర్లోనే ఇమామ్‌ను కూడా పెవిలియన్ చేర్చి పాక్‌కు షాకిచ్చాడు. ఆ తర్వాత జంపా జోరు మొదలైంది.
కాసేపటికే అతను బాబర్ (18)ను పెవిలియన్ చేర్చాడు. ఈ దశలో రిజ్వాన్ (46) నాలుగో వికెట్‌కు సౌద్ షకీల్ (30 )తో 57 రన్స్, ఇఫ్తికార్ (26 )తో ఐదో వికెట్‌కు 37 రన్స్ జోడించి పాక్‌ను రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. షకీల్‌ను ఔట్ చేసి కమిన్స్ కీలక బ్రేక్ ఇవ్వగా.. ఇఫ్తికార్, రిజ్వాన్‌ను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చిన జంపా ఆసీస్‌కు విజయం ఖాయం చేశారు. చివరి బ్యాటర్లు కూడా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో పాక్‌కు ఓటమి తప్పలేదు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా: 50 ఓవర్లలో 367/9 (వార్నర్ 163, మార్ష్ 121, షాహీన్ 5/54, రవూప్ 3/83).
పాకిస్తాన్: 45.3 ఓవర్లో 305 ఆలౌట్ (ఇమామ్ 70, షఫీక్ 64, జంపా 4/53, స్టోయినిస్ 2/40).
వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఓపెనర్లిద్దరూ సెంచరీలు చేయడం ఆసీస్‌కు ఇదే తొలిసారి. టోర్నీలో నాలుగోసారి.
తొలి వికెట్‌కు వార్నర్-మార్ష్ 259 రన్స్ పార్ట్‌నర్‌షిప్ వన్డేల్లో రెండో అత్యుత్తమం. ఆసీస్‌కు ఇదే అత్యధికం
వన్డేల్లో పాక్‌పై వార్నర్‌కు ఇది వరుసగా నాలుగో సెంచరీ. ఒకే ప్రత్యర్థిపై వరుసగా ఎక్కువ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ (విండీస్‌పై నాలుగు) రికార్డు సమం చేశాడు.