David Warner: ముగిసిన వార్నర్ టెస్ట్ చాప్టర్.. విజయంతో వీడ్కోలు

David Warner: ముగిసిన వార్నర్ టెస్ట్ చాప్టర్.. విజయంతో వీడ్కోలు

ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సుదీర్ఘ ఫార్మాట్ కెరీర్ నేటితో ముగిసింది. సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో ముగిసిన చివరి టెస్టులో ఆడిన విజయంతో తన టెస్ట్ కెరీర్ ముగించారు. వార్నర్‌ భాయ్ తన చివరి మ్యాచ్‌లోనూ అభిమానులను అలరించారు. మొదటి ఇన్నింగ్స్‌లో 34, రెండో ఇన్నింగ్స్‌లో 56 పరుగులు చేశారు.

నేటి(జనవరి 6)తో సుదీర్ఘ ఫార్మాట్‌‌కు వీడ్కోలు పలికిన వార్నర్‌.. వన్డేలకు గుడ్ బై చెప్పారు. కాకపోతే తన సేవలు క్రికెట్ ఆస్ట్రేలియా కావాలనుకుంటే వచ్చే ఏడాది పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అడతానని అతను చెప్పినప్పటికీ అది జరుగుతుందని ఆశించలేం. వీడ్కోలు పలికిన ఆటగాడికి క్రికెట్ ఆస్ట్రేలియా మరో అవకాశమిచ్చే మంచి మనసు లేదు. దీంతో అతను మున్ముందు వన్డేల్లోనూ  కనిపించేది అసంభవమే. ప్రస్తుతం వార్నర్ వయసు  37 ఏళ్లు. ఈ ఏడాది జూన్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ అనంతరం వార్నర్‌ పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పవచ్చు.

26 సెంచరీలు

2011లో ఆస్ట్రేలియా తరుపున టెస్ట్ అరంగ్రేటం చేసిన వార్నర్‌.. తన కెరీర్ మొత్తంలో 112 టెస్టులు ఆడారు. 205 ఇన్నింగ్స్‌లో 8786 పరుగులు చేశారు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్.. 335 కాగా, సగటు 44.60. నేటితో టెస్టులు, వన్డేల నుంచి తప్పుకున్న వార్నర్‌.. మున్ముందు ఫ్రాంచైజీ క్రికెట్ లో ఎక్కువగా కనిపించనున్నారు.