PSL 2025: ఐపీఎల్‌లో మిస్సింగ్.. పాకిస్థాన్‌లో రూలింగ్: కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా సన్ రైజర్స్ మాజీ స్టార్

PSL 2025: ఐపీఎల్‌లో మిస్సింగ్.. పాకిస్థాన్‌లో రూలింగ్: కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా సన్ రైజర్స్ మాజీ స్టార్

ఆస్ట్రేలియా మాజీ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొంత ఒడిదుడుకులను ఎదుర్కోనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతానని చెప్పినా అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఆ తర్వాత ఐపీఎల్ లోనూ వార్నర్ కు నిరాశే ఎదురైంది. రూ.2 కోట్ల రూపాయలతో 2025 మెగా ఆక్షన్ లోకి వచ్చిన ఈ విధ్వంసకర ఓపెనర్ ను ఎవరూ కొనలేదు. దీంతో వార్నర్ శకం ముగిసిందనున్నారు. అయితే ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్ లో అదరగొట్టాడు. సిడ్నీ థండర్ జట్టు తరపున అద్భుతంగా ఆడి పాకిస్థాన్ సూపర్ లీగ్ కు సెలక్ట్ అయ్యాడు. 

ALSO READ | CSK vs MI: గైక్వాడ్, ఖలీల్‌పై బాల్ టాంపరింగ్ ఆరోపణలు.. బ్యాన్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్!

ఐపీఎల్ లో అమ్ముడుపోని వార్నర్.. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భారీ ధరకు కొనుగోలు చేయడం విశేషం. 2025 పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ప్లాటినం డ్రాఫ్ట్‌లో 44 మంది ఆటగాళ్లలో వార్నర్ కూడా ఉన్నాడు. దీంతో ఈ ఆసీస్ మాజీ ఓపెనర్  తొలిసారి పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు 2025 పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ కు వార్నర్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. సోమవారం (మార్చి 24) కరాచీ కింగ్స్ జట్టుకు వార్నర్ కెప్టెన్ అని ఆ జట్టు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. 2024 సీజన్ లో కరాచీ కింగ్స్ ను నడిపించిన షాన్ మసూద్ ను పక్కన పెట్టి వార్నర్ కు సారధ్య బాధ్యతలు అప్పగించడం విశేషం. 

గత సీజన్ లో కెప్టెన్ షాన్ మసూద్ చేసిన కృషికి జట్టు యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. 2024 టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో ఆసీస్ మ్యాచ్ ఓడిపోవడంతో వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. జనవరి 6, 2024 న టెస్ట్ ఫార్మాట్‌‌కు వీడ్కోలు పలికిన వార్నర్‌.. వన్డేలకు గుడ్ బై చెప్పారు. వార్నర్ కు ఐపీఎల్ లో అద్భుతమైన రికార్డ్ ఉంది. రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడంతో పాటు 2016 లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు టైటిల్ అందించాడు. ఐపీఎల్ లో ఈ సారి నిరాశే మిగిలినా అతనికి పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కెప్టెన్సీ ఆఫర్ రావడం ఊరట కలిగిస్తుంది. 

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025 పదో ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 11న ప్రారంభం కానున్న ఈ టోర్నీ మే 18 న ఫైనల్ తో ముగుస్తుంది. తొలిసారి పాకిస్థాన్ సూపర్ లీగ్ ఐపీఎల్ తో పోటీ పడనుంది. ఐపీఎల్ మార్చి 22 నుంచి మే 25 వరకు జరుగుతుంది. ఐపీఎల్ తర్వాత పాకిస్థాన్ సూపర్ లీగ్ ను ఎక్కువగా చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఈ సారి రెండు లీగ్స్ క్లాష్ అవ్వడంతో క్రికెట్ ఫ్యాన్స్ కు డబుల్ కిక్ లభించనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఇస్లామాబాద్ యునైటెడ్ బరిలోకి దిగుతుంది. 

టోర్నీ తొలి మ్యాచ్ లో లాహోర్ ఖలందర్స్ తో ఇస్లామాబాద్ యునైటెడ్ తలపడనుంది. రావల్పిండి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. రావల్పిండి క్వాలిఫైయర్ 1తో సహా టోర్నమెంట్‌లోని 11 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. లాహోర్‌లోని ఐకానిక్ గడాఫీ స్టేడియంలో  ఫైనల్, ఎలిమినేటర్స్ తో సహా మొత్తం 13 మ్యాచ్ లు జరుగుతాయి. కరాచీలోని నేషనల్ స్టేడియం, ముల్తాన్ చెరో ఐదు మ్యాచ్ లకు ఆతిధ్యం ఇవ్వనున్నాయి. మొత్తం 6 జట్లు (ఇస్లామాబాద్ యునైటెడ్, లాహోర్ ఖలందర్స్,పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్,కరాచీ కింగ్స్, ముల్తాన్ సుల్తాన్స్) టైటిల్ కోసం తలపడనున్నాయి.