జనవరి 3 నుంచి పాకిస్థాన్‌తో జరగనున్న ఆఖరి టెస్ట్ అనంతరం ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టులకు వీడ్కోలు పలకనున్న విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. అందుకు ముందు వార్నర్‌కు షాక్ తగిలింది. అతని బ్యాగీ గ్రీన్ క్యాప్ (టెస్టుల్లో ధరించే క్యాప్) ఎవరో దొంగలించారు.
తన బ్యాగ్ ప్యాక్ ఎవరో తీసుకున్నారని, దయచేసి దానిని తిరిగి ఇవ్వాలని వార్నర్ సోషల్ మీడియా వేదికగా అందరికీ విజ్ఞప్తి చేశారు. చివరి టెస్ట్ కోసం మెల్‌బోర్న్ నుంచి సిడ్నీ వచ్చే క్రమంలో ఈ ఘటన జరిగిందని చెప్పిన వార్నర్.. దానిని తిరిగి ఇచ్చేయాలని వేడుకున్నారు. కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడుతున్నందున తనను బాధ పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. వార్నర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ… "అందరికీ నమస్కారం.. సిడ్నీ టెస్టు నా చివరి టెస్ట్ మ్యాచ్. దురదృష్టవశాత్తూ మెల్‌బోర్న్ నుంచి సిడ్నీకి వచ్చే సమయంలో నా బ్యాక్‌ప్యాక్ ఎవరో తీసుకున్నారు. అందులో నా బ్యాగీ గ్రీన్ క్యాప్ మరియు నా పిల్లల వస్తువులు ఉన్నాయి. దానిని నాకు తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా.."
"ఇప్పటికే నేను సిడ్నీ, మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్టులలో వీడియో పుటేజీలు కూడా చెక్ చేశాను. కానీ ఎక్కడా వాటి జాడ కనిపించలేదు. ఒకవేళ మీలో ఎవరైనా అది తీసినా.. మీకు కనిపించినా దయచేసి నాకు అది తిరిగిచ్చేయండి. అదే మీరు కోరుకున్న బ్యాక్‌ప్యాక్ అయితే, అటువంటిది మరొకటి నా దగ్గర ఉంది. అది ఇస్తాను.. అలా తిరిగి ఇవ్వడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందుల్లో పడరు.. " అని వార్నర్ వీడియోలో ప్రాధేయపడ్డారు.
పోరాట యోధుడు
వార్నర్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అతనొక పోరాట యోధుడు. అతడు క్రీజులో కుదుర్కున్నాడంటే ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చీకటి రాత్రే. ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే ఆస్ట్రేలియా తరపున అరంగేట్రం చేసిన ఈ విధ్వంసకర ఓపెనర్.. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇప్పటివరకూ 111 టెస్టులు ఆడిన వార్నర్.. 44.59 సగటుతో 8,695 పరుగులు చేశారు. ఇందులో 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల విషయానికొస్తే.. 161 మ్యాచ్‌ల్లో 6,932 పరుగులు చేశారు. ఇందులో 22 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇకపై వార్నర్.. టీ20లు, ఫ్రాంచైజీ క్రికెట్ లో మాత్రమే కనిపించనున్నారు.