AUS vs WI: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ డాషింగ్ ఓపెనర్.. తాజాగా తన టీ20 కెరీర్ త్వరలో ముగించనున్నాడు. జూన్ లో వెస్టిండీస్, అమెరికా ఆతిధ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ తన టీ20 కెరీర్ లో చివరిదని వార్నర్ అన్నాడు.

2009 లో డేవిడ్ భాయ్ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. నిన్న (ఫిబ్రవరి 9) వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ వార్నర్ కు 100 వది. ఈ మ్యాచ్ లో వార్నర్ 36 బంతుల్లోనే 12 ఫోర్లు, ఒక సిక్సర్ తో 70 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 100 టీ20 మ్యాచ్ ల్లో 2964 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. విండీస్ తో మరో 2 టీ20 లు, న్యూజీలాండ్ తో మరో 3 టీ20 మ్యాచ్ లు ఆస్ట్రేలియా ఆడనుంది. జూన్ ప్రారంభంలో టీ20 వరల్డ్ కప్ జరుగుతుంది.  

జనవరి 6, 2024 న టెస్ట్ ఫార్మాట్‌‌కు వీడ్కోలు పలికిన వార్నర్‌.. వన్డేలకు గుడ్ బై చెప్పారు. కాకపోతే తన సేవలు క్రికెట్ ఆస్ట్రేలియా కావాలనుకుంటే వచ్చే ఏడాది పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అడతానని అతను చెప్పినప్పటికీ అది జరుగుతుందని ఆశించలేం. వీడ్కోలు పలికిన ఆటగాడికి క్రికెట్ ఆస్ట్రేలియా మరో అవకాశమిచ్చే మంచి మనసు లేదు. దీంతో అతను మున్ముందు వన్డేల్లోనూ  కనిపించేది అసంభవమే.        

2011లో ఆస్ట్రేలియా తరుపున టెస్ట్ అరంగ్రేటం చేసిన వార్నర్‌.. తన కెరీర్ మొత్తంలో 112 టెస్టులు ఆడారు. 205 ఇన్నింగ్స్‌లో 8786 పరుగులు చేశారు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్.. 335 కాగా, సగటు 44.60. 161 వన్డేల్లో 6932 పరుగులు చేశాడు. వీటిలో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ వార్నర్‌.. మున్ముందు ఫ్రాంచైజీ క్రికెట్ లో ఎక్కువగా కనిపించనున్నాడు.