మొతెరాలో ఇంగ్లండ్‌తో
పింక్ బాల్ పోరు!
ఇకపై ప్రతి సిరీస్‌లో ఓ డే నైట్ ఉండేలా చూస్తాం
బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ
బంగ్లాదేశ్‌తో తొలి డే నైట్ టెస్టు ఆడిన టీమిండి యా మరో రెండు పింక్ బాల్ మ్యాచ్‌లకు ఓకే చెప్పింది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లనున్న ఇండియా కంగారూలతో ఓ డే నైట్ టెస్టు ఆడుతుందని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆదివారం తెలిపాడు. దీనిపై తొందర్లోనే అధికారిక ప్రకటన వస్తుందని చెప్పాడు. అలాగే, వచ్చే ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో సొంతగడ్డపై జరిగే సిరీస్‌లో సెకండ్ టెస్ట్‌ను ఇండియా పింక్ బాల్‌తో ఆడుతుందన్నాడు. ఈ మ్యాచ్ ప్రపంచంలోనే అతి పెద్దది కానున్న అహ్మదాబాద్ మొతెరా స్టేడియంలో జరిగే చాన్సుంది. ఇప్పటి నుంచి ప్రతీ సిరీస్‌లో కనీసం ఒక్క డే నైట్ మ్యాచ్‌ను అయినా షెడ్యూల్ చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తుందని దాదా చెప్పాడు. గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్ అయిన కొద్ది రోజులకే గతేడాది నవంబర్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా పింక్ బాల్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. ఇక, ఆస్ట్రేలియాలో ఏ గ్రౌండ్‌లోనైనా డే నైట్ ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కెప్టెన్ విరాట్ కోహ్లీ గతనెలలోనే స్పష్టం చేయడంతో బోర్డు కూడా మరో పింక్ పోరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరిలో ఇండియా టూర్ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అధికారుల బృందం… బీసీసీఐ టాప్ అఫీషియల్స్‌ను కలిసి ఇదే విషయంపై చర్చించింది. అయితే, ఇండియాతో రెండు డే నైట్ మ్యాచ్‌లు కావాలని సీఏ కోరగా.. బోర్డు ఒక్కదానికే ఒప్పుకుంది. ‘నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు పింక్ టెస్టులు అంటే టూ మచ్ అవుతుంద’ని దాదా అభిప్రాయపడ్డాడు. కాగా, ఇండియా-, ఆసీస్ మధ్య డే నైట్ మ్యాచ్ వేదికను ఖరారు చేయాల్సి ఉంది. బ్రిస్బేన్ లేదా అడిలైడ్‌లో ఈ పోరు జరిగే చాన్సుంది. కాగా, ఐపీఎల్ ముగిసిన తర్వాత శ్రీలంకలో ఇండియా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఆడే అవకాశం ఉంది.
బిగ్గెస్ట్ స్టేడియంలో డే నైట్!
వచ్చే ఏడాది జనవరి––ఫిబ్రవరిలో ఇండియా టూర్‌కు రానున్న ఇంగ్లండ్ ఐదు టెస్టులు ఆడనుంది. 2021 జూన్‌లో ముగిసే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌నకు ముందు ఇండియా ఆడే లాస్ట్ సిరీస్ ఇది. దాంతో ఈ సిరీస్ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు లక్షా 11 వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న మొతెరాలో డే నైట్ నిర్వహించాలని బోర్డు భావిస్తోంది. ఈ మేరకు ఆదివారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో మొతెరాను షార్ట్‌లిస్ట్ చేసింది. రికార్డు స్థాయి సీటింగ్ కెపాసిటీతో పునరుద్ధరించిన ఈ స్టేడియాన్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ నె ల 24న ప్రారంభించనున్నారు.