- గ్రామాలు, పట్టణాల్లో బీభత్సం సృష్టిస్తున్న కోతులు
- కోతుల దాడిలో పలువురికి గాయాలు
- కనిపించని మంకీ ఫుడ్ కోర్టులు
మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ జిల్లాలో రోజురోజుకు కోతుల బెడద పెరిగిపోతోంది. పల్లెలు, పట్టణాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతున్న కోతులు కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేయడమే కాకుండా, ఇండ్లలోకి చొరబడుతూ వస్తువులను చిందరవందర చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతుల దాడుల కారణంగా కొందరు ప్రాణాలు కోల్పోతుండగా, మరికొందరు గాయాల పాలవుతున్నారు.
దెబ్బతింటున్న పంటలు
కోతుల కారణంగా ఇటు ఇండ్లు, అటు పంటలు ఆగమాగం అవుతున్నాయి. కోతులు ఇండ్లలోకి చొరబడి మహిళలు, పిల్లలపై దాడులు చేయడమే కాకుండా, వస్తువులు, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్తున్నాయి. వీటి బాధ తట్టుకోలేక కిరాణా షాపుల నిర్వాహకులు ఇనుప జాలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే కోతుల కారణంగా వరి, మక్కజొన్న, పెసర, వేరుశనగ పంటలు దెబ్బతింటున్నాయి. వరి, మక్కజొన్న కంకులను ఎక్కడికక్కడ కొరికి పడేస్తుండడం, చివరకు పత్తి చేనులోనూ కాయలు తెంపడం వల్ల భారీగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోతుల సమస్యను పరిష్కరించాలని కేసముద్రం మండలం ఉప్పరపెల్లి గ్రామానికి చెందిన రైతులు ఇటీవల రాస్తారోకో నిర్వహించారు.
ఫలించని ప్రయత్నాలు
గ్రామాలు, పట్టణాల్లో కోతుల నివారణకు రైతులు, ప్రజలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. కొన్ని గ్రామాల్లో రైతులంతా కలిసి కొండముచ్చులను కొనుగోలు తీసుకొచ్చారు. మరికొన్ని చోట్ల బర్నర్ గన్నుల సాయంతో సౌండ్స్ చేస్తూ, డమ్మీ బొమ్మలు పెడుతూ కోతులను తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల కోతులు పోయినట్లే పోయి మళ్లీ తిరిగి వస్తున్నాయి. మరో వైపు మంకీఫుడ్ కోర్టుల ఏర్పాటుతో సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడమే మానేసింది.
ఇటీవల జరిగిన ఘటనలు
- గత నెల3న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో కోతులు ఎలక్ట్రివైరు బలంగా ఊపడంతో ఇంటి గోడపై ఉన్న ఇటుక మహిళపై పడి స్పాట్‌లో చనిపోయింది.
- కొత్తగూడ మండలంలో పొగుళ్లపల్లి 3వ తేదీన పీఏసీఎస్ సీఈవో వెంకన్నపై కోతులు దాడి చేసి గాయపరిచాయి.
- కొత్తగూడ మండలం గాంధీనగర్ గురుకుల స్కూల్‌కు చెందిన 10 మంది స్టూడెంట్లు కోతుల గుంపును చూసి పారిపోతుండగా, కిందపడి గాయాలపాలయ్యారు.
- తొర్రూరు పట్టణంలో ఇటీవల కోతుల దాడిలో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు.