నోటు లేకుండా ఓట్లు అడిగే సత్తా బీఆర్​ఎస్​కు లేదు: విజయకుమార్

సత్తుపల్లి, వెలుగు :  అభివృద్ధి చేశామని చెప్పుకునే బీఆర్​ఎస్​కు సత్తుపల్లిలో ఓటుకి నోటు లేకుండా ప్రజల్లోకి వచ్చే సత్తా లేదని జిల్లా కాంగ్రెస్ నాయకుడు మట్టా దయానంద్ విజయకుమార్​ ఆరోపించారు. డబ్బులు ఇవ్వకుండా ప్రచారం చేస్తానని అంబేద్కర్​ విగ్రహం దగ్గరకొచ్చి ప్రకటించాలని దయానంద్​ ఎమ్మెల్యే సండ్రకు సవాల్​ చేశారు. శుక్రవారం అంబేద్కర్​ విగ్రహం దగ్గరకు ఎమ్మెల్యే రాలేదు.

అక్కడ దయానంద్​ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రకటనలు నీటి మీద రాతలేనన్నారు. ఎమ్మెల్యే వెంకట వీరయ్య చెబుతున్నట్లు సత్తుపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగి ఉంటే తన సవాల్ ను ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ లకు రిజర్వు అయినప్పటికీ ఆ పదవిని ఎందుకు భర్తీ చేయలేదని అడిగారు. దళిత ఎమ్మెల్యే అయి ఉండి నియోజకవర్గంలో దళితుల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు గాదె చెన్నారావు, నరుకుళ్ల ‌అప్పారావు పాల్గొన్నారు.