
మధ్యాహ్నం నాలుగు ముద్దలు కడుపులోకి వెళ్లాక చిన్నగా ఒక కునుకు తీస్తే బాగుండు అనిపించని వాళ్లు ఉండరు. అందుకే కొందరు కుర్చీలో కూర్చునే కునుకుపాట్లు పడుతుంటారు. అయితే ఇలా తీసే పొట్టి నిద్ర మంచిదేనా? లేకపోతే పగటి నిద్ర పనికి చేటు అంటారా? అసలు సైన్స్ దీని గురించి ఏమంటుంది?
మధ్యాహ్నం లంచ్ చేసిన తరువాత మత్తుగా అనిపించడం సహజం. అలాంటప్పుడు కాసేపు కళ్లు మూసుకుని ఓ చిన్న కునుకు(న్యాప్) తీస్తే మంచిది అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. దీనిమీద ఒక రీసెర్చ్‌లో మాత్రం మధ్యాహ్న భోజనం తరువాత కాసేపు అలా ఒరిగితే దాని ఇంపాక్ట్ దీర్ఘకాలంలో ఉంటుంది. అదెలాగంటే కార్డియోవాస్కులార్ ఆరోగ్యానికే కాకుండా, మెదడు కణాలను కాపాడేందుకు రక్షణ కవచంగా ఉంటుంది. డెమెన్షియా బారిన పడకుండా కూడా ఉంచుతుంది” అని తేలింది.
మెదడుకి మంచిది
30 నిమిషాల న్యాప్ అనేది నిజానికి ఎక్కువ టైం కాకపోయినప్పటికీ మెదడుకి చాలా సాయం చేసిన వాళ్లు అవుతారు’’ అంటున్నారు యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో ఎపిడిమియాలజిస్ట్గా ఉన్న విక్టోరియా గార్ఫీల్డ్. బ్రెయిన్ పవర్‌కు న్యాప్ బాగా పనిచేస్తుందని ఇప్పటికే చాలా స్టడీలు వెల్లడిచేశాయి. ఇంతకుముందు చేసిన పరిశోధనల్లో న్యాప్ వల్ల చురుకుదనం, జ్ఞాపకశక్తిలో మెరుగుదల కనిపించాయి. అంతేకాదు కాసేపు తీసే కునుకు క్రియేటివిటీని పెంచుతుంది. 2021లో కొందరి మీద ఒక రీసెర్చ్ చేశారు. అందులో పాల్గొన్న వాళ్లకు మ్యాథ్స్ ప్రాబ్లమ్ ఒకటి ఇచ్చారు. ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కంటే ముందు వాళ్లలో కొందరిని బ్రీఫ్ న్యాప్ తీసుకోమన్నారు. న్యాప్ తీసుకున్న వాళ్లు మెలకువతో ఉన్న వాళ్లతో పోలిస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్‌కు షార్ట్‌కట్ కనుగొనడంలో మెరుగ్గా ఉన్నారని తేలింది.
రాత్రిళ్లు నిద్ర సరిగా నిద్రపోని వాళ్లకు పగలు తీసే చిన్న కునుకు చాలా మేలు చేస్తుందట. షిఫ్ట్‌ల్లో పనిచేసేవాళ్లు, కొత్తగా తల్లిదండ్రులైన వాళ్లు, ముసలివాళ్లకు రాత్రి నిద్ర తక్కువగా ఉంటుంది. వీళ్లంతా పగటి సమయంలో నిద్రపోతే మెదడుకి బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుందని 2014లో చేసిన ఒక రీసెర్చ్ వెల్లడిచేసింది. ఉదాహరణ చూస్తే.. నైట్ షిఫ్ట్ వర్క్ చేసేవాళ్లలో పగలు తీసే న్యాప్ వల్ల మత్తుగా ఉండడం తగ్గింది. అలాగే వాళ్ల పనితీరు కూడా మెరుగుపడింది. స్లీప్ ఇనెర్షియా... అంటే నిద్రపోయి లేచాక కూడా బద్ధకంగా ఉండేవాళ్లకి న్యాప్ చాలా మేలు చేస్తుంది అని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్శిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫెలో నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చెప్తోంది. 20 నిమిషాలు న్యాప్ తీసుకుంటే చాలు రీఛార్జ్ అవుతారు. అదే 60–90 నిమిషాలు అయితే ఇంకా మెరుగ్గా ఉంటారు అని సైకాలజిస్టులు చెప్తున్నారు.
షార్ట్ టర్మ్ బెనిఫిట్స్
న్యాప్ వల్ల కలిగే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ గురించి స్పష్టంగా చెప్తున్నారు. కానీ లాంగ్ టర్మ్ లాభాల గురించి నిర్ధారించి చెప్పడంలేదు. న్యాప్స్ అనేవి కార్డియో వాస్కులర్ (గుండె రక్తనాళాలకు సంబంధించిన)ఆరోగ్యానికి మంచిదా? కాదా? అనేది ఇంకా తేలలేదు. ఆ విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. నిజానికి పగటిపూట నిద్ర అనేది కొన్ని అనారోగ్య సమస్యలకు సిగ్నల్ కూడా. అనారోగ్యం వల్ల కూడా పగలు నిద్రపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఒక్కో మనిషి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి అని కొందరు రీసెర్చర్లు చెప్తున్నారు. ‘‘వయసు పైబడిన వాళ్లలో లాంగ్ న్యాప్స్ అనేవి అల్జీమర్స్కి రిస్క్ ఫ్యాక్టర్‌గా చూడాలి. అల్జీమర్స్ ఉన్నవాళ్లు ఎక్కువసేపు, ఎక్కువసార్లు పగలు నిద్రపోతుంటారు’’ అని 2021లో అల్జీమర్స్ అండ్ డిమెన్షియా జర్నల్‌లో పబ్లిష్ చేసిన ఒక రీసెర్చ్ ఆర్టికల్‌లో చెప్పారు.
హార్ట్ డిసీజ్‌లు తగ్గాయి
ఇదిలా ఉంటే ‘‘మధ్యవయసు వాళ్లలో న్యాప్ వల్ల కరొనరీ హార్ట్ డిసీజ్‌లు తగ్గాయి. కార్డియో వాస్కులర్ డిసీజ్, కార్డియో వాస్కులర్ కండిషన్ వల్ల సంభవించే మరణాలను కూడా తగ్గించాయి. షార్ట్ న్యాప్స్ వల్ల బ్లడ్ ప్రెషర్, గుండె కొట్టుకునే వేగం తగ్గాయి. అడ్రినలిన్ వంటి హార్మోన్ల విడుదల కూడా ఈ న్యాప్ వల్ల తగ్గింది. ఒక్కమాటలో చెప్పాలంటే కార్డియో వాస్కులర్ ఆరోగ్యాన్ని మెరుగపరిచింది’’ అని 2017లో చేసిన ఒక రీసెర్చ్ చెప్పింది. అయితే 65 ఏండ్ల వయసు ఉన్నవాళ్లలో ఒక గంట లేదా అంతకంటే ఎక్కువసేపు లాంగ్ న్యాప్స్ తీయడం వల్ల కార్డియాక్ రిస్క్ పెరిగిందని మరో స్టడీ చెప్తోంది. ఎక్కువసేపు నిద్రపోవడం అనేది బయటకు తెలియని వ్యాధి వల్ల కావచ్చు అంటోంది ఆ స్టడీ.
వయసు పెరుగుతున్నా కొద్దీ అందరి మెదళ్లలో కణాలు క్షీణిస్తుంటాయి. అయితే, డిమెన్షియా ఉన్న వాళ్లలో ఆ క్షీణత కాస్త ఎక్కువగా ఉంటుంది. స్లీప్ ఆప్నియా ఉన్న వాళ్లకి, స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ ఎక్కువగా విడుదలయ్యే వాళ్లకు మెదడులో సెల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సెల్ లైఫ్‌స్పాన్ తగ్గే ప్రమాదం ఉంది. రెగ్యులర్‌గా న్యాప్ తీసుకుంటుంటే 2.6 నుంచి 6.5 ఏండ్ల వయసు వెనక్కి వచ్చినట్టే. బ్రెయిన్ వాల్యూమ్ లాస్ కాకుండా కాపాడుకున్నట్టే అని స్లీప్ హెల్త్‌లో రిపోర్ట్ చేశారు రీసెర్చర్లు.
అయితే, ప్రతి ఒక్కరికీ భోజనం తరువాత కునుకు తీసే అవకాశం ఉండదు. అలాంటి వాళ్లు రోజులో అరగంట వాకింగ్ లేదా జిమ్ చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే బ్రెయిన్ బాగుంటుంది. కాకపోతే న్యాప్ వల్ల వచ్చే లాభం ఇంకాస్త ఎక్కువ. వారంలో కొన్ని రోజులు 20 నిమిషాలు లేదా అంతకంటే తక్కువ అయినా సరే కునుకు తీస్తే మూడ్‌తో పాటు మెదడు పనితీరు కూడా బెటర్‌గా ఉంటుందని రీసెర్చర్లు తేల్చారు.