
విశాఖపట్నం: తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించి వెంటనే ఘోర ఓటమితో డీలా పడ్డ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్18వ సీజన్‌లో తమ మూడో పోరుకు సిద్ధమైంది. తమ మొదటి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం వైజాగ్‌లో పోటీ పడనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఉత్కంఠ విజయం సాధించి జట్టున ఢిల్లీ ఇప్పుడు ఇండియా వికెట్‌కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ తిరిగి జట్టులో చేరడంతో మరింత బలపడింది. తన భార్య డెలివరీ కారణంగా లక్నోతో తొలి మ్యాచ్‌కు మిస్సైన రాహుల్ ఇప్పుడులోకి తిరిగి వచ్చాడు. ఐపీఎల్‌లో కొత్త జట్టుతో కొత్త ఆరంభానికి సిద్ధమైన రాహుల్ తన బ్యాటింగ్‌తో ఢిల్లీ జట్టును మరింత బలోపేతం చేయనున్నాడు.
టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కోల్పోయిన రాహుల్ ఈ ఐపీఎల్‌లో తన ఆటతీరును మెరుగు పరుచుకొని షార్ట్‌ఫార్మాట్‌లో నేషనల్ టీమ్‌లో పోటీకి వస్తానని లీగ్ ఆరంభానికి ముందు చెప్పాడు. లక్నోతో గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన ఆటతీరును చూపెట్టింది. 211 రన్స్ టార్గెట్ ఛేదించే క్రమంలో 65/5తో కష్టాల్లో పడిన ఢిల్లీ ఆఖర్లో అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్ అద్భుత పోరాటంతో ఒక వికెట్ తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అక్షర్ పటేల్ కెప్టెన్సీలోని ఢిల్లీ టీమ్ సన్ రైజర్స్‌పైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.
ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో 286/6 స్కోరుతో ఔరా అనిపించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ గత పోరులో లక్నో చేతిలో 190/9 స్కోరు చేసి 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. భారీ అంచనాలున్న టాప్–5 బ్యాటర్లు ఢిల్లీపై సత్తా చాటాలని మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు సెంచరీ తర్వాతి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఇషాన్ కిషన్ రాణిస్తేనే రైజర్స్ మళ్లీ మంచి స్కోరు చేయగలదు.
ట్రావిస్ హెడ్ ఫామ్‌లో ఉండటం ప్లస్ పాయింట్ అయినా.. మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ ఆట జట్టుకు కీలకం కానుంది. దాంతో పాటు బౌలింగ్‌లో సన్ రైజర్స్ మెరుగవ్వాల్సి ఉంది. కెప్టెన్ పాట్ కమిన్స్ 15 ఎకానమీ రేట్‌తో నిరాశపరిచాడు. షమీ, హర్షల్ పటేల్‌లతో కూడిన బౌలింగ్ విభాగం ఈ మ్యాచ్‌లో మెరుగైన పెర్ఫామెన్స్ చేస్తేనే జట్టు తిరిగి విజయాల బాట పట్టగలదు.