DC vs LSG: పొరెల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలు.. లక్నో ఎదుట భారీ టార్గెట్

DC vs LSG: పొరెల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలు.. లక్నో ఎదుట భారీ టార్గెట్

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట‌ర్లు అదరగొట్టారు. వందల మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకున్నా.. యువ క్రికెటర్లు అందరూ రాణించి జట్టుకు భారీ లక్ష్యాన్ని అందించారు. సొంతగడ్డపై లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. అభిషేక్ పొరెల్(58), ట్రిస్టన్ స్టబ్స్(57 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేయగా.. షాయ్ హోప్(38), రిషబ్ పంత్(33) విలువైన పరుగులు చేశారు.   

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని అర్షద్ ఖాన్‌ తొలి ఓవర్‌లోనే దెబ్బకొట్టాడు. విధ్వంసకర ఓపెన‌ర్ జేక్ ఫ్రేజ‌ర్ మెక్‌గుర్క్(0) రెండో బంతికే పెవిలియన్ చేర్చాడు. ఆ సమయంలో అభిషేక్ పొరెల్ (58), షాయ్ హోప్(38) ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బౌండ‌రీల‌తో విరుచుకుప‌డుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 ర‌న్స్ జోడించారు.

ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడీని బిష్ణోయ్ విడ‌దీశాడు. తొమ్మిదో ఓవర్‌లో హోప్ ను ఔట్ చేశాడు. ఆ సమయంలో కెప్టెన్ రిష‌భ్ పంత్‌(33) ఆచితూచి ఆడాడు. ఆపై కొద్దిసేపటికే అభిషేక్ పొరెల్ (58) ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన  ట్రిస్టన్ స్టబ్స్(57 నాటౌట్; 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) తనదైన ఆటతో మరోసారి ఆకట్టుకున్నాడు. మొదట్లో పరుగుల వేటలో వెనుకబడినా.. చివరలో మెరుపులు మెరిపించాడు. అక్సర్ పటేల్ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. 

లక్నో బౌలర్లలో నవీన్-ఉల్-హక్ 2 వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు.