DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ

DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ సేన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్.. రెండు విభాగాల్లోనూ రాణించింది. ఫలితంగా, సొంతగడ్డపై ల‌క్నోను 19 పరుగుల తేడాతో మట్టి కరిపించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. మొదట ఢిల్లీ క్యాపిట‌ల్స్ 208 పరుగులు చేయగా.. ఛేదనలో లక్నో నిర్ణీత ఓవర్లలో 189 పరుగులకు పరిమితమైంది. ఈ ఓటమితో లక్నో ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మరో మ్యాచ్‌లో లక్నో గెలిచినా ముందంజ వేయడం కష్టమే.

భారీ చేధనకు దిగిన లక్నోను ఢిల్లీ వెటరన్ పేసర్ ఇషాంత్ శ‌ర్మ బెంబేలెత్తించాడు. తొలి ఓవర్‌‌లో కేఎల్ రాహుల్ (5)ను ఔట్ చేసిన ఇషాంత్.. అమరుసటి ఓవర్‌లో క్వింటన్ డికాక్ (12)ను పెవిలియన్ చేర్చాడు. అనంతరం అక్షర్ పటేల్ వేసిన నాలుగో ఓవర్‌ మొదటి బంతికే స్టోయినిస్ (5) స్టంపౌటయ్యాడు. దీంతో లక్నో 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ (61; 27 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో బ్యాటర్లు వీడుతున్నా.. తన దూకుడు మాత్రం ఆపలేదు. దీంతో లక్నో మరోసారి రేసులోకి వచ్చింది.

అయితే, కీలక సమయంలో ముకేశ్‌ కుమార్‌.. పూరన్‌ (61)ను ఔట్ చేశాడు. దీంతో మ్యాచ్ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరలో అర్షద్ ఖాన్(58 నాటౌట్; 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు)కాసేపు ఢిల్లీ అభిమానులను భయపెట్టాడు. భారీ సిక్స్‌లు కొడుతూ మ్యాచ్‌ను చివరివరకూ తీసుకెళ్లాడు. క్యాపిటల్స్ బౌలర్లలో ఇశాంత్ శర్మ 3 వికెట్లు పడగొట్టాడు.

పోరెల్, స్టబ్స్ అర్ధ శతకాలు

అంతకుముందు ఢిల్లీ యువ బ్యాట‌ర్లు అదరగొట్టారు. అభిషేక్ పొరెల్(58), ట్రిస్టన్ స్టబ్స్(57 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేయగా.. షాయ్ హోప్(38), రిషబ్ పంత్(33) విలువైన పరుగులు చేశారు. దీంతో క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో నవీన్-ఉల్-హక్ 2 వికెట్లు పడగొట్టగా.. అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ తీసుకున్నారు.