IPL 2024: పాచి ప‌ట్టిన భోజ‌నం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!

IPL 2024: పాచి ప‌ట్టిన భోజ‌నం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!

బెంగళూరుకు చెందిన ఓ ప్రేక్షుకుడు గత వారం జరిగిన ఓ ఐపీఎల్ మ్యాచ్‌ తనను ఆస్పత్రి పాలు చేసిందని ఆరోపిస్తూ చిన్నస్వామి స్టేడియం యాజమాన్యంపై కేసు పెట్టాడు. అతని ఫిర్యాదు ఆధారంగా పోలీసులు.. స్టేడియం నిర్వాహకులు, క్యాంటీన్ అధికారులపై కేసు నమోదు చేశారు. విషపూరిత పదార్థాలకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించే IPC సెక్షన్ 284 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసలేం జరిగింది..? ఈ వివాదం ఏంటన్నది తెలియాలంటే కింద చదివేయండి.. 

మే 12న బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఆ మ్యాచ్‌కు చైత‌న్య అనే యువ‌కుడు త‌న స్నేహితుడితో క‌లిసి హాజరయ్యాడు. మ్యాచ్ మ‌ధ్యలో ఆకలి వేయడంతో సదరు యువకుడు స్టేడియంలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌కు వెళ్లి భోజనం ఆరగించాడు. అంతే, అది తిన్న ఐదు నిమిషాల్లోనే యువకుడు స్టేడియంలో కూర్చున్నచోట‌నే కింద‌ప‌డిపోయాడు. వెంట‌నే అప్రమ‌త్తమైన‌ మైదాన సిబ్బంది అత‌నికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అతని స్నేహితుడు చైత‌న్యను ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చేర్పించారు. చికిత్స సమయంలో అక్కడి డాక్టర్లు అతనికి ఫుడ్ పాయిజ‌న్ అయినట్లు తేల్చారు. దీంతో సదరు యువకుడు.. నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

"మ్యాచ్ సమయంలో నేను ఆహారం తినడానికి క్యాంటీన్‌కు వెళ్లాను. నెయ్యి అన్నం, చన్నా మసాలా, డ్రై జామూన్, కట్లెట్ తిన్నాను. నేను భోజనం ముగించిన రెండు నిమిషాల తర్వాత కాస్త అనారోగ్యంగా అనిపించింది. అనంతరం ఐదు నిమిషాల తర్వాత నేను కూర్చున్నచోట కుప్పకూలిపోయాను. పాచిపోయిన ఆహారం తినడం వల్లే నేను అస్వస్థతకు గురయ్యానని వైద్యుడు ధృవీకరించారు.."  బాధితుడు పేర్కొన్నాడు.
     
చైతన్య ఫిర్యాదు మేరకు కబ్బన్ పార్క్ పోలీసులు.. స్టేడియం నిర్వాహకులు, క్యాంటీన్ అధికారులపై కేసు నమోదు చేశారు. IPC సెక్షన్ 284 కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. దీనిపై ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ.. సంఘటన జరిగిన రోజు వడ్డించిన ఆహారంపై నివేదికను సమర్పించాలని స్టేడియం అధికారులను కోరినట్లు తెలిపారు. ఆ నివేదిక వచ్చిన ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.