హైదరాబాద్‌సిటీ, వెలుగు: కాలం తీరిన మందులు అమ్ముతున్న పలు మెడికల్ షాపులపై ఆదివారం హైదరాబాద్ సిటీలో పలు చోట్ల డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు జరిపి సీజ్ చేశారు. సికింద్రాబాద్‌లోని సీతాఫల్ మండి, రామంతాపూర్ పరిధిలోని మెడికల్ అండ్ జనరల్ షాపుల్లో తనిఖీలు చేసిన ఆఫీసర్లు ఇమ్యూనిటీ బూస్టర్లు, కంటికి సంబంధించిన అయింట్మెంట్స్, కాస్మొటిక్స్ సహా 45 రకాల డ్రగ్స్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సీతాఫల్‌మండిలోని గాయత్రి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ లో గడువు ముగిసిన మెడిసిన్ అమ్మకాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 1.25 లక్షల విలువైన స్టాక్‌ను సీజ్ చేసి యజమానికి నోటీసులు ఇచ్చారు.
రామంతాపూర్‌లోని మరో మెడికల్ షాపులో నిషేధించిన కంటికి సంబంధించిన మందులను అమ్ముతున్నట్టు గుర్తించారు. కొన్ని మందులకు సంబంధించి అడ్వర్టయిజ్మెంట్లలో వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ప్రచారం నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. రెసిడెన్షియల్ ఏరియాలు, కమర్షియల్, ఇండస్ర్టియల్ ఏరియాల్లో జరిగే డ్రగ్స్ దందాపై అనుమానం ఉన్నా వెంటనే సమాచారం ఇవ్వాలని డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్జనరల్ వీబీ కమలాసన్ రెడ్డి తెలిపారు. గడువు ముగిసిన మందులు, నకిలీ మెడిసిన్స్, అనుమతి లేని మందుల విక్రయాలు సాగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆదివారం నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు.