అమిత్ షాను బర్తరఫ్ చేయాలి .. డీసీసీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి డిమాండ్

అమిత్ షాను బర్తరఫ్ చేయాలి .. డీసీసీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి డిమాండ్

సిద్ధిపేట టౌన్, వెలుగు: పార్లమెంట్ లో అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డీసీసీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి డిమాండ్​చేశారు. గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ తో కలిసి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షా చిత్రపటాన్ని దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి మొదటి నుంచి అంబేద్కర్ పై మంచి అభిప్రాయం లేదన్నారు. తమకు మాత్రం అంబేద్కర్ దేవుడని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తూ ఇమామ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 అమిత్ షా సభ్యత్వం రద్దు చేయాలి

సంగారెడ్డి టౌన్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని సంగారెడ్డిలో సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ తీశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యత గల మంత్రిగా ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదన్నారు. భారత రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్య యాదవ్, నాయకుడు అశోక్ ఆరోపించారు. రామారావు, లక్ష్మి, అనంతయ్య, రాములు, లక్ష్మయ్య, జైపాల్, రాజేందర్, సాగర్, నాగరాజు, ప్రభుదాస్, ప్రవీణ్, పాల్గొన్నారు.