డీసీసీ పంచాయితీ!.. పార్టీలు మారిన వ్యక్తికి పదవులా..?

  • అండెం సంజీవ రెడ్డి ఎంపికను వ్యతిరేకిస్తున్న నేతలు
  • పార్టీలు మారిన వ్యక్తికి పదవులా..? అని కామెంట్లు
  • సోషల్​ మీడియాలో వైరల్​అవుతున్న పోస్టులు
  • ఎమ్మెల్యే టికెట్లు బీసీకే ఇవ్వాలని డిమాండ్​

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.  అండెం సంజీవరెడ్డికి పదవి ఇవ్వడాన్ని పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీలు మారడమే కాదు.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థికి వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తికి అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈమేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరికొందరు నేతలు డీడీసీ ప్రెసిడెంట్ పోస్టు రెడ్డి వర్గానికి ఇస్తే ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి 

డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్​కుమార్​రెడ్డి బీఆర్​ఎస్​లో చేరడంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. అధ్యక్షుడి పదవి విషయంలో ఎంపీ కోమటిరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి జోక్యంపై యాదాద్రి జిల్లా లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో జానారెడ్డి వెనక్కి తగ్గినా కోమటి రెడ్డి మాత్రం తన పంతం నెగ్గించుకున్నారు.  ఆయన సూచించిన గుండాల మండలానికి చెందిన అండెం సంజీవరెడ్డికే హైకమాండ్ డీసీసీ ప్రెసిడెంట్‌గా అవకాశం ఇచ్చింది. 

కాంగ్రెస్​లో అసంతృప్తి 

ఈ పరిణామంతో అధ్యక్ష పదవిని ఆశించిన నేతలు, ముఖ్యంగా బీసీ లీడర్లు నిరాశకు గురయ్యారు.  దీంతో సోషల్​ మీడియాను వేదికగా చేసుకొని సంజీవరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.  గతంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో గుండాల మండలంలో రెబల్‌గా క్యాండిడేట్‌గా పోటీ చేయడంతో పాటు  2014  అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలోనే ఉంటూ వ్యతిరేకంగా పనిచేయడంతోనే బూడిద భిక్షమయ్య ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  2018లో బీఆర్​ఎస్​లో చేరి ఆలేరు అభ్యర్థి గొంగిడి సునీత గెలుపు కోసం పని చేశారని చెబుతున్నారు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్ ఇస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు.  అలాగే 2022 జూలైలో యాదాద్రి డీసీసీ అధ్యక్షుడిగా పోత్నక్​ ప్రమోద్​కుమార్​ను ఎంపీ కోమటిరెడ్డి సిఫారసు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి రిటర్నింగ్​ ఆఫీసర్​ రాజమోహన్​కు కోమటిరెడ్డి రాసిన  లెటర్​ చూపిస్తున్నారు.  

పదవి ఆశించిన వారిలో ప్రముఖులు

అయితే డీసీసీని ఆశించిన వారిలో కాంగ్రెస్​ దీర్ఘకాలికంగా కొనసాగుతున్న వారున్నారు. కాంగ్రెస్​ తరపున రెండుమార్లు పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్​ కుడుదల నగేశ్​,  ఎన్​ఎస్​యూఐ, యువజన కాంగ్రెస్​లో పనిచేసి పీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పోత్నక్​ ప్రమోద్​కుమార్​, పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి ఆయోధ్యరెడ్డి ఆశించారు. అయితే వీరిని కాదని పార్టీ మారి వచ్చిన సంజీవరెడ్డిని ఎంపిక  చేయడాన్ని కాంగ్రెస్​ కేడర్​ జీర్ణించుకోలేక పోతోందని ఆ పార్టీ లీడర్లే అంటున్నారు. అయితే గా డీసీసీ విషయంలో రెడ్లకే ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. 

పోత్నక్​ అసంతృప్తి

డీసీసీ పదవిని ఆశించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్​ ప్రమోద్​ కుమార్​ తన అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు. దశాబ్దాలుగా కాంగ్రెస్​లోనే కొనసాగుతున్న తనకు డీసీసీ ఇవ్వకుండా పార్టీలు మారిన సంజీవరెడ్డికి ఎలా ఇస్తారంటూ కామెంట్​ చేశారు. అసెంబ్లీ ఎన్నికల విషయంలో బీసీలకు టికెట్లు ఇస్తానని ఇచ్చిన హామీని గుర్తుంచుకొని అమలు చేయాలని కోమటరెడ్డిని ఉదేశిస్తూ కామెంట్​ చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి నుంచి తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.