- గాదరి కిశోర్ పై మండిపడ్డ కాంగ్రెస్ శ్రేణులు
నల్గొండ అర్బన్, వెలుగు : రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. గురువారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు ఆఫీస్లో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుడారు. బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా దోచుకొని దాచుకున్నారని విమర్శించారు.
అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గాదరి కిషోర్ బతుకేంటో అందరికీ తెలుసని అన్నారు. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తన్ని తరిమి కొట్టినా కేటీఆర్, కేసీఆర్ మెప్పుకోసం మంత్రులపై స్థాయి మరిచి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఇకనైనా సంస్కారహీనంగా మాట్లాడడం మానుకోవాలని,లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థాయిని మరిచి, వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొట్టడం ఖాయమని హెచ్చరించారు. మూసీ ప్రక్షాళనతో నల్గొండ ప్రజలకు మేలు జరుగుతుందని, కానీ ప్రతిపక్ష నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై ఇప్పటికైనా గాదరి కిశోర్ చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేశ్, మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు కత్తుల కోటి, కౌన్సిలర్లు బొజ్జ శంకర్, జూలకంటి శ్రీనివాస్, కేసాని వేణుగోపాల్ రెడ్డి, బుర్రి యాదయ్య పాల్గొన్నారు.