నల్గొండ అర్బన్, వెలుగు : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా వివక్ష చూపించిందని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ సోమవారం నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్ లో పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం బడ్జెట్ కేటాయింపులో తెలంగాణపై వివక్షత చూపించిందని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే ఎక్కువ బడ్జెట్ కేటాయించిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించకుండా పక్షపాతం వహించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి రూ.26 వేల కోట్ల పన్నులు తీసుకొని బడ్జెట్లో తెలంగాణకు కేటాయించింది గుండు సున్నా అని విమర్శించారు. మోదీ మూడుసార్లు పీఎం అయినా పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, ప్రాంతీయ రవాణాశాఖ డైరెక్టర్ కుసుకుంట్ల రాజిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.