చౌటుప్పల్, వెలుగు: రేవంత్ రెడ్డికి అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షుల మద్దతు ఉందని, ఆయనకు అండగా ఉంటామని యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం మునుగోడు ఎన్నికల ప్రచారంలో అందుబాటులో ఉన్న 13 మంది డీసీసీ అధ్యక్షులతో చౌటుప్పల్ లో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
మొన్నటి సమావేశంలో రేవంత్‌రెడ్డి బాధపడడం తమ మనసును కలిచివేసిందని డీసీసీ అధ్యక్షులు అన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్‌రెడ్డితో కలిసి పోరాడతామన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్యూ గురించి మాట్లాడుతూ ఆ విషయం అధిష్ఠానం దృష్టిలో ఉందని, తామేమీ వ్యాఖ్యానించదలుచుకోలేదన్నారు. సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, తదితర జిల్లాల డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.