చండ్రుగొండ, వెలుగు : వ్యవసాయ పెట్టుబడుల కోసం సొసైటీల పరిధిలో రుణాలు తీసుకున్న 37,625 మంది రైతులకు గాను మొదటి దఫాగా రూ.121.63 కోట్లు రుణమాఫీ జరిగినట్లు ఉభయ జిల్లా డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరావు తెలిపారు. గురువారం చండ్రుగొండలోని డీసీసీబీని ఆయన సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉభయ జిల్లా లో 1,69,854 మంది రైతులు రూ.908.27 కోట్లు రుణాలు తీసుకున్నారని తెలిపారు.
అర్హులందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు. తిరిగి కొత్తగా రుణాలు పొందేందుకు కొర్రీలు పెడ్తున్నారని వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న రైతుల సమస్యలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ సమావేశంలో బ్రాంచ్ మేనేజర్ ప్రసన్న, సొసైటీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, సీఈవో లంకా నర్సింహారావు పాల్గొన్నారు.
జూలూరుపాడు : జూలూరుపాడు సొసైటీ కార్యాలయాన్ని దొండపాటి వెంకటేశ్వరరావు సందర్శించారు. బ్యాంక్ కార్యకలాపాల గురించి బ్రాంచ్ మేనేజర్ మానుసను అడిగి తెలుసుకున్నారు. సొసైటీ చైర్మన్ చీమలపాటి భిక్షం, డైరెక్టర్లు ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్లంకి సత్యనారాయణ, చాపలమడుగు రామ్మూర్తి, లకావత్ హేమ్లా, బ్రాంచ్ మేనేజర్ మానుస, సీఈవో రమణారెడ్డి పాల్గొన్నారు.