యాదాద్రి, వెలుగు : ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలపై డీసీసీబీ చైర్మన్గొంగిడి మహేందర్‌రెడ్డి సీరియస్అయ్యారు. ఎవరూ బయటకు వెళ్లకుండా గేట్లు బంద్ చేయాలని ఆదేశించారు. మీటింగ్‌కు రానివాళ్లను పదవుల నుంచి తొలగించి, కొత్తోళ్లను నియమిస్తామని ఫైర్అయ్యారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజవర్గంలోని రాజాపేటలో సోమవారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇతర కార్యక్రమాలు ఉండడంతో ఎమ్మెల్యే గొంగిడి సునీత ముందుగానే మాట్లాడి వెళ్లిపోయారు. తర్వాత మీటింగ్‌ను గొంగిడి మహేందర్‌రెడ్డి నడిపించారు. ఈ సందర్భంగా లీడర్లను వేదికపైకి వచ్చి మాట్లాడాలని ఆహ్వానించారు. అయితే వారిలో కొందరు రాకపోవడంతో సీరియస్ అయ్యారు. మీటింగ్‌కు రాని వాళ్లకు పదవులెందుకు? వారిని తొలగించి కొత్త వాళ్లను ఎంపిక చేయాలని కామెంట్చేశారు. మీటింగ్కంటిన్యూగా సాగుతుండడం, ఊహించిన దానికంటే ఎక్కువ మంది రావడంతో ముందుగానే భోజనాలు చేయాలని కొందరు లీడర్లు, కార్యకర్తలు లేవడానికి ప్రయత్నం చేస్తుండడంతో మహేందర్‌రెడ్డి మైక్ అందుకొని అందరికి సరిపడా భోజనాలున్నాయి.. ఎవరూ బయటకు వెళ్లొద్దు కూర్చోండని పలుమార్లు అభ్యర్థించారు. ఇదే సమయంలో కొందరు లీడర్లు బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. మరికొందరు లీడర్లు వెళ్లిపోవడానికి కార్లను స్టార్ట్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన ‘ఎవరూ బయటకు వెళ్లొద్దు. ఎవరిని పోనియ్యొద్దు. గేట్లు బంద్ చేయండి. తాళాలు వేయండి. వెళ్లిపోతున్న ఆ కారు నెంబర్ నోట్ చేసుకోండి’ అని మైక్‌లో ఆదేశించారు. అయినప్పటికీ కొందరు వెళ్లిపోగా, మరికొందరు వచ్చి కూర్చున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ పైకి లేచి ‘ఉన్నోళ్లకే పదవులు ఇస్తే.. మేమెట్లా బతకాలంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. అంతా గందరగోళంగా ఉండడంతో ఆమె మాట్లాడేది విన్పించలేదు. ఇది గమనించిన ఓ లేడీ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఆ మహిళను పక్కకు తీసుకెళ్లారు. ఈ టైంలోనే ఓ మహిళకు ఫిట్స్వచ్చి కింద పడిపోవడంతో అందరూ కొద్దిసేపు కంగారుపడ్డారు.
ఆలేరుకు ఇద్దరు ఎమ్మెల్యేలు!
ఆత్మీయ సమ్మేళనంలో ఓ లీడర్ మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా ఆలేరుకు ఇద్దరు ఎవ్మెల్యేలున్నారన్నారు. దీంతో అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 'అన్ని నియోజకవర్గాలకు ఒక్క ఎమ్మెల్యే ఉంటే.. ఆలేరుకు ఇద్దరు ఎమ్మెల్యేలున్నరు. మేడం (ఎమ్మెల్యే గొంగిడి సునీత) అందుబాటులో లేకున్నా మహేందర్‌రెడ్డి (డీసీసీబీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే భర్త) పగలనకా.. రాత్రనక చూసుకుంటడు. నిజంగా ఆలేరు ప్రజలు అదృష్టవంతులు’ అని అన్నారు. మూడోసారి ఎమ్మెల్యేగా సునీతను గెలపించుకుంటే మంత్రి అవుతుందని పలువురు కార్యకర్తలు కామెంట్ చేశారు. మరికొందరు మాట్లాడుతూ పాత, కొత్త లీడర్ల మధ్య విభేదాలున్నాయన్నారు. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో నష్టం తప్పదన్నారు. కార్యకర్తలను చీప్‌గా చూస్తూ డమ్మీలుగా మార్చేస్తున్నారన్నారు. ఐకమత్యం లేక గత మండల పరిషత్ ఎన్నికల్లో మన అభ్యర్థులను మనమే ఓడించుకున్నామని, ఈసారి పొరపాట్లు జరగకుండా ముందే గుర్తించి విబేధాలు
పరిష్కరించాలన్నారు.