జూలైలో ఆరు కొత్త బ్రాంచ్‌లు : డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి

  • డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు: జూలైలో ఆరు కొత్త బ్రాంచ్‌లు ప్రారంభించనున్నట్లు డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీలో ఆయన ఆధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెట్‌ ప్రాఫిట్ రూ. 15.42 కోట్లతో పాటు ఉమ్మడి జిల్లాలోని 108 సొసైటీలకు రికవరీ శాతం ప్రకారం రూ. 25 లక్షల వరకు మంజూరు చేయాలని తీర్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్పీఏ, ప్రాఫిట్‌లో నల్గొండ డీసీసీబీ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని గతంలో ఎన్నడూ లేనివిధంగా డీసీసీబీ గ్రాస్ ప్రాఫిట్ రూ. 36.42 కోట్లకు చేరిందన్నారు.  ఎన్పీఏ 1.36 శాతానికి  రావడం శుభ పరిణామమన్నారు.  చైర్మన్లు, సభ్యుల కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. 

వారంలోగా అన్ని బ్రాంచులలో ఫోన్ పే, గూగుల్ పే చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా మీసేవ మాదిరిగా కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఆధార్, పాన్ కార్డుతో పాటు ట్రైన్, ఫ్లైట్, బస్ టికెట్లు కూడా ఇక్కడే బుక్‌ చేసుకోవచ్చన్నారు.  దీనిపై సొసైటీల పరిధిలో ప్రచారం చేయాలని సూచించారు. ఎడ్యుకేషన్ లోన్ల పరిమితి రూ. 30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు పెంచామని చెప్పారు.  వచ్చే నెలలో పోచంపల్లి, నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు, చిట్యాల, చండూరు, మేళ్లచెరువు, రాజపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా కొత్తబ్రాంచ్‌లు ప్రారంభిస్తామని చెప్పారు.